సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్య జోరు రోజురోజుకూ రెట్టింపవుతోంది. జిల్లాలో నెల నుంచి సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఆర్టీసీ కార్మికులు గురువారం ర్యాలీతో ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ఐకేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, సోనియా దిష్టిబొమ్మ దహనం తదితర కార్యక్రమాలు కొనసాగాయి.
ఉపాధ్యాయుల సమ్మెతో ప్రభుత్వ పాఠశాలల బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు తిరగడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. నగరం, పట్టణం, ఊరూవాడా, చిన్నా పెద్ద అందరూ సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారు. నగరంలో ఎస్టీయూ భారీ ప్రదర్శన నిర్వహించింది. వీఆర్‌సీ, గాంధీబొమ్మ కూడలిలో మానవహారం నిర్వహించారు.
వీఆర్‌సీ కూడలిలో వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ రిలేనిరాహారదీక్షలు నిర్వహించింది. ఆర్టీసీ కార్మికులు భారీ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో హరనాథపురంలో రాస్తారోకో నిర్వహించారు. నగరపాలకసంస్థ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. డీఆర్‌డీఏ ఉద్యోగులు ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఉదయగిరిలో సమైక్యాంధ్ర, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో రెండోరోజు నిరాహార దీక్షలో విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయగిరి సీతారామపురం రోడ్డుపై క్యారమ్స్, చెస్, క్రికెట్, వాలీబాల్, తదితర ఆటలతో నిరసన తెలిపారు. సీతారామపురం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు విద్యార్థులు సంఘీభావం తెలిపారు. అంతకు ముందు హైస్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దుత్తలూరులో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు బస్టాండ్ సెంటర్‌లో నిరాహార దీక్షలు చేశారు. వింజమూరులోని పోలీస్‌స్టేషన్ సమీపంలో జరుగుతున్న ఉద్యోగ రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరాయి.
గూడూరు టవర్‌క్లాక్ కూడలి ప్రాంతం వద్ద మహిళలు రాస్తారోకో నిర్వహించారు. అలాగే యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. ఎద్దుల బండికి సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలు వేలాడదీసి వీరతాళ్లతో కొట్టుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కోట క్రాస్‌రోడ్డులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యానగర్‌లో ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. వాకాడులో వైఎస్సార్‌సీపీ నేత నేదురుమల్లి ఉదయ్‌శే ఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వాకాడు స్వర్ణముఖి బ్యారేజిపై మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు.
సూళ్లూరుపేటలో తెలుగుదేశం నాయకుడు వేనాటి సుమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజుకు చేరుకుంది. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష 16వ రోజుకు చేరింది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం దీక్షలో కూర్చున్నారు. పట్టణంలో మెకానిక్స్‌ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తడలో రెవెన్యూ ఉద్యోగులు రిలే నిరాహారదీక్ష చేశారు. నాయుడుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు.
ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ సెంటర్‌లో విశ్రాంత ఉద్యోగులు రిలేనిరాహారదీక్ష చేశారు. ఆర్టీసీ కార్మికులు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులు శరీరానికి చెట్ల కొమ్మలు చుట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు.
సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరు మండలంలోని నరుకూరు నుంచి ఉపాధ్యాయులు మోటారుసైకిళ్లతో ప్రదర్శన జరిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా చెన్నపల్లిపాళెం హైస్కూల్ విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంటలో ఎంపీడీఓ, తహశీల్దార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
కోవూరు ఎన్‌జీఓహోంలో పెయింటింగ్ కార్మికులు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ, మండల పరిషత్, ఎంఈఓ దీక్ష చేపట్టారు.
వెంకటగిరి నియోజవకర్గం సైదాపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా శ్రీకృష్ణని వేషధారణతో ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహారదీక్షకు వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. టాటా ఏస్‌లతో ర్యాలీ నిర్వహించారు.
కావలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యాన మౌనప్రదర్శన చేశారు.
ఉద్యమపురి
Published Fri, Aug 30 2013 4:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement