కడప రూరల్, న్యూస్‌లైన్ : విజయదశమి పర్వదినం రోజున శనివారం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు, నిరసనలు కొనసాగాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని తన వద్దకు వచ్చిన ఎన్జీవోలకు రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ మేరకు ప్రమాణం చేసి హామీ పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, నగేశం, వెంకటేశ్వర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి పాల్గొన్నారు. కడపలో మంత్రి అహ్మదుల్లా ప్రమాణం చేసి హామీ పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎన్జీవో నాయకులు శ్రీనివాసులు, గోపాల్‌రెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పర్యవేక్షణలో భవిష్యత్తు ఉద్యమ ప్రణాళికను రూపొందించారు. ఈ నెల 15న రైతు గర్జన, 19న విద్యార్థిసింహగర్జన, 23వ తేదీన సర్వమత ప్రార్థనలు చేపట్టాలని నిర్ణయించారు. కడపలో ఎన్జీవోలు దీక్షలు చేపట్టారు.
కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు, ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు నాగమునిరెడ్డి, వెంకటశివారెడ్డి, చిల్లర దుకాణ వర్తకుడు షేక్ కరీముల్లాబాష తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగులో జేఏసీ కన్వీనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు పాత బస్టాండు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మైదుకూరు, పోరుమామిళ్లలో ఉపాధ్యాయ జేఏసీ, మున్సిపల్ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో కుళాయప్ప, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.