అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : తెలుగు జాతి ఐక్యతే లక్ష్యంగా, రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా పోరు ఆగదని స్పష్టీకరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు సమైక్య నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. 38వ రోజైన శుక్రవారం కూడా నిరసన కార్యక్రమాలతో ‘అనంత’ అట్టుడికింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఎస్కేయూలో విద్యార్థులు ‘సింహగర్జన’ చేశారు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు వేలాది మంది తరలివెళ్లారు. గుంతకల్లులో సమైక్యవాదులు ఐదు వందలకు పైగా ఆటోలు, ట్యాక్సీలతో మహార్యాలీ నిర్వహించారు. కసాపురం వేద పండితులు ప్రధాన రహదారిపైనే సద్భావనా శాంతి హోమం చేశారు. ప్రభుత్వ జేఏసీ, వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
అనంతపురం నగరంలో జాక్టో నేతలు దీక్షలు కొనసాగిస్తూనే భిక్షాటన చేశారు. రోడ్లను ఊడ్చి, వంటా వార్పుతో నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ రిలేదీక్షలు కొనసాగాయి. ఎన్జీఓ, పంచాయతీరాజ్ జేఏసీ, డీఆర్‌డీఏ, హౌసింగ్, వాణిజ్య పన్నుల శాఖ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల రిలే దీక్షలు మధ్యాహ్నం వరకు కొనసాగించారు. అనంతరం హైదరాబాద్ సభకు తరలివెళ్లారు. మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. న్యాయవాదులపై దాడికి నిరసనగా ఎస్కేయూలో సమైక్యవాదులు కళ్లకు నల్లగుడ్డ కట్టుకుని నిరసన తెలిపారు.
ధర్మవరంలో కళాకారుల సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కదిరిలో బాలాజీ విద్యా సంస్థల అధ్యాపకులు, సిబ్బంది రిలే దీక్షలు చేశారు. విద్యుత్ ఉద్యోగులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో యాదవులు నిరసన ర్యాలీ చేశారు. జేఏసీ నేతల దీక్షలు కొనసాగాయి. కుందుర్పిలో ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించిన అనంతరం.. రిలేదీక్షలకు కూర్చున్నారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి, సప్తగిరి కళాశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. రెవెన్యూ, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. మడకశిరలో సాదర కులస్తుల ర్యాలీలో ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. జేఏసీ నేతలు పోస్ట్ కార్డులు చేతపట్టుకుని ర్యాలీ చేశారు. క్రైస్తవులు 560 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఫోర్‌వీల్స్ వాహనదారుల సంఘం ఆధ్వర్యంలో గుడిబండ నుంచి మడకశిర వరకు వాహనాల ర్యాలీ నిర్వహించారు. అమరాపురంలో వర్తకులు ర్యాలీ, మానవహారం చేపట్టారు.
ఉపాధ్యాయులు రోడ్డుపైనే పిల్లలకు పాఠాలు చెప్పి నిరసన తెలిపారు. రొళ్లలో సాదర సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. పెనుకొండలో రాజకీయ జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ‘పరమానందయ్య శిష్యుల నిరసన’ ఆకట్టుకుంది. రొద్దంలో మహిళలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. గోరంట్లలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. సోమందేపల్లిలో వాహన యజమానులు ర్యాలీగా వచ్చి... 44 జాతీయ రహదారిని కాసేపు దిగ్బంధించారు.
రాయదుర్గంలో పాత్రికేయులు 48 గంటల దీక్షకు కూర్చున్నారు. ఉద్యోగ, రాజకీయ జేఏసీ, జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో సమైక్యవాదులు దున్నపోతులతో ర్యాలీ చేశారు. రాప్తాడులో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. చెన్నేకొత్తపల్లిలో కేబుల్ ప్రసారాలను బంద్ చేశారు. ఆత్మకూరులో కళాశాల విద్యార్థినులు నిరాహార దీక్ష చేపట్టారు. తాడిపత్రిలో మునిసిపల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దవడుగూరులో నాయీ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు.
ఊరూరా ఉద్యమం
Published Sat, Sep 7 2013 4:31 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement