
కక్షలు కన్నీళ్లు
గుంటూరు జిల్లాలో ఘటనలు
రాజధానిగా రూపాంతరం చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గతించిపోతున్న 2015 నేరపరంగా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృతిచెందడం, సంవత్సరం మొదట్లోనే విజయవాడలోని భవానీపురంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతిచెందడం, కల్తీ మద్యం తాగి మరో ఐదుగురు ప్రాణాలొదలడం, కాల్‌మనీ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అష్టకష్టాలు పడటం, ఏఎన్‌యూలో ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలి, పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో జిల్లావాసులు కన్నుమూయడం కన్నీటి జ్ఞాపకాలే. ఇక చోరీలు ఈ ఏడాది విచ్చలవిడిగా జరిగాయి. మన రాష్ర్ట దొంగలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు చెలరేగిపోయాయి. చైన్‌స్నాచింగ్‌లు ఊహకందనంత రీతిలో జరిగాయి. గ్రూపు తగాదాలు, ముఠా కక్షలు పెచ్చుమీరాయి. ఇక రాజధాని నేపథ్యంలో ఏర్పడిన భూతగాదాలు రక్త సంబంధీకుల మధ్య చిచ్చురేపి అన్నదమ్ములను కోర్టుకు లాగాయి. ెుుత్తంమీద 2015 సంవత్సరం కృష్ణా, గుంటూరు జిల్లాలపై రక్తచరిత్రనే లిఖించింది.
గుంటూరు : గుంటూరు, కృష్ణాజిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తక్కువగానే ఉన్నా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నేరాలు అనేకం జరిగాయి. హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, మోసాలు, మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపులు, నమ్మక ద్రోహాలు, భూ వివాదాలు, రోడ్డు ప్రమాదాలతో 2015లో రాజధాని రక్తసిక్తంగా మారింది. తుళ్లూరులో భూ కబ్జాలు పెరిగి వివాదాలు చెలరేగాయి. రక్తసంబంధాలు కూడా చూడకుండా దాడులకు దిగారు. గుంటూరు జిల్లాలో రిషితేశ్వరి, జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో చిన్నారి మృతి వంటి సంఘటనలు, విజయవాడలో కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కాల్‌మనీ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి.
దొంగల హల్‌చల్
గత రెండేళ్లతో పోలిస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దొంగల ముఠాలు స్వైర విహారం చేశాయి. చైన్‌స్నాచింగ్, ఇళ్లల్లో జరిగే దొంగతనాలకు లెక్కే లేకుండాపోయింది. ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పెట్టి పక్కకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా ఇరాని, పార్ధివ్, బిహారీ ముఠాలు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
►చిలకలూరిపేటలో శంకర్ అనే విలేకరిపై మంత్రి అనుచరులు దాడిచేసి హతమార్చిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
►గుంటూరు జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో వైద్యం కోసం చేరిన పదిరోజుల పసికందును ఎలుకలు కొరికి చంపాయి. సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో, వైద్య అధికారి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, పారిశుధ్య కాంట్రాక్టర్లపై వేటు పడింది.
►తుళ్లూరులో చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన చెరుకు పంటను గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు.
►లింగాయపాలెంలో రాజేష్ అనే రైతుకు చెందిన ఏడు ఎకరాల భూమిలో వేసిన అరటి తోటను సీఆర్‌డీఏ అధికారులు పొక్లెయిన్లతో ధ్వంసం చేశారు.
►మంగళగిరిలో రెండు వర్గాల ఘర్షణలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన సంచలనం కలిగించింది.
►మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి, మాచర్ల, వెల్దుర్తి మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు మావోయిస్టుల పేరుతో వాల్ పోస్టర్లు వెలిసిన సంఘటన ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది.
►ఏసీబీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి వీరయ్యచౌదరి ఇంటిపై దాడులు నిర్వహించి రూ.1.5 కోట్లకుపై అక్రమ ఆస్తులను గుర్తించి ఆయన్ను అరెస్టు చేసిన సంఘటన సంచలనం కలిగించింది.
► గుంటూరు నగరంలో ఒకేరోజు గంట వ్యవధిలో ఎనిమిది చైన్‌స్నాచింగ్‌లు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
► గుంటూరు-విజయవాడల్లో సిమీ ఉగ్రవాదులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు సూర్యాపేట ఎన్‌కౌంటర్ ఉదంతంతో బయటకు రావడంతో అంతా హడలిపోయారు.
►గుంటూరు జీజీహెచ్‌లో సిబ్బంది అవినీతి వల్ల ఇద్దరు తల్లులు తనకు మగబిడ్డ పుట్టాడంటూ గొడవకు దిగి ఆడశిశువును పట్టించుకోకపోవడంతో మృతిచెందిన దారుణ సంఘటన సంచలనం కలిగించింది.
►బాపట్ల మండలం చుండూరుపల్లిలో సాంబశివరావు అనే ఎన్‌ఆర్‌ఐ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.3.5 కోట్ల సొత్తు చోరీకి గురికావడం సంచలనం కలిగించింది. దొంగను పట్టుకుని చోరీ సొత్తును పోలీసులు వారం వ్యవధిలోనే రికవరీ చేయడం మరో సంచలనం.
ఏఎన్‌యూలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం కలిగించింది. రిషితేశ్వరి సంఘటన జరిగిన నాలుగు రోజులకే వట్టిచెరుకూరు మండలంలో ఓ కళాశాలలో సునీత అనే విద్యార్థిని ర్యాగింగ్ విషయంలో తనపై చర్యలు తీసుకుంటారేమోననే భయంతో కళాశాల భవనం పై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. వెల్దుర్తి మండలానికి చెందిన తిరుపతమ్మ అనే విద్యార్థిని తనపై కొంతమంది విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల వద్ద వెంకటరమణ అనే విద్యార్థినిపై ఓ ఉన్మాది సుత్తితో దాడిచేసి తలపై కొట్టడంతో తీవ్రగాయాల పాలైంది.