ఈ నెల 15 వరకు సమయం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : ఎట్టకేలకు వేరుశనగ పంటకు వాతావరణ ఆధారిత బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకూ పొడిగించారు. మొదట్లో ప్రీమియం గడువు పొడిగింపుపై ప్రభుత్వం జీవో విడుదల చేసినా అందుకు బీమా కంపెనీ అంగీకరించలేదు. దీంతో జీవో అమలుకు నోచుకోలేదు. ఈ విషయమై ‘బీ(ధీ)మా పోయే’ శీర్షికన ఈ నెల ఒకటో తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. రైతులకు జరగనున్న అన్యాయాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదనరావు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను బీమా కంపెనీ అధికారులకు వివరించి, ప్రీమియం పొడిగింపునకు వారిని ఒప్పించారు. ఆ మేరకు వ్యవసాయ బీమా కంపెనీ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
బీమా ప్రీమియం పొడింగింపు ఉత్తర్వులు అందినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులు (లోనీ ఫార్మర్స్) ఈ నెల 15 వరకు బీమా ప్రీమియం చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వేరుశనగ రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా బీమా ప్రీమియం చెల్లింపు గడువు కేవలం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి, వెంటనే రుణాలు రీషెడ్యూల్ చేసుకుని పంటల బీమా సౌకర్యాన్ని పొందాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు.
బీమా ప్రీమియం గడువు పొడిగింపు
Published Sun, Sep 7 2014 2:14 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement