ఎల్లప్ప, నారాయణరెడ్డి వాహన డ్రైవర్
నారాయణరెడ్డి హత్యలో ప్రత్యక్ష సాక్షుల కథనం
ముందుగా మా జీపు వెళ్తోంది. వెనుక మాది ఇంకో జీపు వస్తోంది. మధ్యలో ఒక ట్రాక్టర్ పొలంలో నుంచి వేగంగా వచ్చి మా జీపును (నారాయణరెడ్డి జీపును) ఢీకొంది. బ్రేక్ సరిగ్గా పడక తగిలిందనుకున్నా. మిర్రర్‌లో వెనుకవైపు చూస్తుండగా, ముందుగా ఇంకో ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. ఒకేసారి రెండు వైపుల నుంచి రెండు ట్రాక్టర్లు కొద్దిసేపు ఢీకొట్టాయి. దీంతో మా జీపు రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఆ వెంటనే జీపుపై రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో మోరీల్లో, బెండచేనులో దాక్కున్న వారు వెంటనే బయటకు వచ్చి కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. నారాయణరెడ్డి జీపు ముందుభాగంలో కూర్చున్నాడు. దిగుదామంటే ట్రాక్టర్ అడ్డంగా ఉంది. అదే సమయంలో దాడి చేయడానికి వచ్చిన వారు నన్ను గుంజి (లాగి) పోతావారా.. నిన్ను చంపాలా అన్నారు. ఇంక నేను దిగి పారిపోయినా.
జీపులో ఉన్న మిగతావారిని కూడా అలాగే బెదిరించి పంపించేశారు. సాంబశివుడు ఒక్కడే వారిని ఎదిరించాడు. దీంతో ఆయనను కాస్త దూరం తీసుకెళ్లి నరికి చంపేశారు. ఆ వెంటనే నారాయణరెడ్డి తలనరికి, రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ సమయంలో రెడ్డి ‘చంపిరి రా నన్ను చంపిరి రా’ అని అరిచాడు. మొత్తం 20 మందికి పైగా దాడి చేశారు. దాడి చేసిన వారిలో నలుగురిని గుర్తుపట్టాను. ట్రాక్టర్ తోలిన వారిలో రామాంజనేయులు, రామనాయుడుతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మిగతా వారు మాస్క్‌లు వేసుకుని వచ్చారు. చంపిన తర్వాత ట్రాక్టర్‌పై వెళ్లేటప్పుడు కొడవళ్లు తిప్పుకుంటూ వెళ్లిపోయారు.
– ఎల్లప్ప, నారాయణరెడ్డి వాహన డ్రైవర్
అబ్బా.. రెడ్డిని చంపిరే అని కూతలు వేసినా..!
రెండు బండ్లు కలిసిపోతున్నాయి. కల్వర్ట్ రిపేరి ఉండటంతో మా బండ్లు స్లో అయ్యాయి. ఇదే సమయంలో ఒక ట్రాక్టర్ రఫ్‌గా రెండు బండ్ల మధ్య దూరింది. ఆ వెంటనే నారాయణరెడ్డి జీపును వెనుక నుంచి గుద్దాడు. ఆ జీపులో ఉన్న డ్రైవర్ ఎల్లప్ప మిర్రర్ నుంచి వెనుక చూసేలోపు ముందు నుంచి మరో ట్రాక్టర్ గుద్దింది. అప్పుడు డౌట్ వచ్చేసింది మాకు. అబ్బా.. రెడ్డిని చంపిరే అని నేను కూతలు వేసినా. బండి స్లో చేసి దిగడానికి వెళితే లెఫ్ట్‌సైడ్ బాంబు వేసినారు. మనలను కూడా చంపుతారు. మన వద్ద ఏమీ లేవని ముందుకెళ్లి చూసినా అంతలోపే నారాయణరెడ్డి బండిపైకి ఎక్కేసి రాళ్లు వేసి కొడవళ్లతో ఆయనను పొడుస్తున్నారు. మేము ఇబ్బంది పడతామని చెప్పి కిలోమీటర్‌న్నర దూరంలో ఉన్న క్రిష్ణగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాం. సార్ రెడ్డిని చంపుతున్నారు సార్ అని చెబితే నలుగురైదుగురు పోలీసులు బైక్‌లపై వచ్చారు. ఈలోగా సాంబశివుడును చంపిన వారు పొలాల్లో, నారాయణరెడ్డి చంపిన వారు చెరుకులపాడు వైపు ట్రాక్టర్‌లో వెళ్లిపోయారు. మొత్తం పది నిమిషాల్లో అయిపోయింది.
– కృష్ణమోహన్, నారాయణరెడ్డిని అనుసరిస్తున్న జీపు డ్రైవర్
కేఈ శ్యాంబాబు బెదిరించాడు...
కేఈ శ్యాంబాబు నాకు గతంలో ఫోన్ చేసి బెదిరించారు. ‘నువ్వు చిట్యాలలో సుధాకర్‌రెడ్డి కట్ట విషయంలో ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆ పంచాయతీలో నీవు ఎక్కువ తల దూరుస్తున్నావు. మీ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆరు నెలల కంటే ఎక్కువ బతకడు’ అని చెప్పి వెంటనే నా ఫోన్ కట్ చేశాడు.
– నాగరాజు, చిట్యాల గ్రామస్తుడు, నారాయణరెడ్డి అనుచరుడు