తాళ్లూరు: ప్రభుత్వ వైఫల్యంతో రైతుల పరువు బజారున పడుతోంది. పాలకుల హామీలు నమ్మిన వారికి చివరకు అవమానాలు మిగులుతున్నాయి. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్న రైతుల బంగారాన్ని బహిరంగ వేలం వేస్తామంటూ బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తుండటం..వారి పేర్లతో ప్రకటనలు ఇవ్వడాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రుణమాఫీపై రోజుకో మాట చెబుతూ తీవ్ర జాప్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ రెండో విడత జాబితా విడుదలలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది.
రుణమాఫీపై ఆశలు పెట్టుకుని బకాయిలు సకాలంలో తిరిగి చెల్లించని రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రుణమాఫీ రెండో విడత జాబితా కోసం ఎదురుచూస్తున్న రైతులకు బ్యాంకర్లు నోటీసులతో షాకిస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో 45,773 మంది రైతులకు వివిధ బ్యాంకుల్లో రూ.326.63 కోట్ల బ కాయిలున్నా యి. అందులో రూ.99 కోట్ల బంగారం రుణాలున్నాయి. బంగా రం రుణం తీసుకున్న రైతులు తమ బంగారాన్ని కాపాడుకోవడం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
కొంత సొమ్ము చెల్లించినా..
నోటీసులకు స్పందించి ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అందిన కాడికి వడ్డీలకు తెచ్చి కొంత మొత్తం బ్యాంకు రుణాల వడ్డీ కింద జమేసినా..వేలాన్ని ఆపడం లేదని రైతులు వాపోతున్నారు. సరిపడా మొత్తానికి జమ పడటం లేదని బంగారాన్ని వేలం వేస్తున్నారు. దీంతో ఇదేమి పద్ధతి అని రైతులు బ్యాంకర్లతో ఘర్షణకు దిగుతున్నారు. కనీసం వేలం రోజైనా తమకు సమాచారం ఇవ్వాలి కదా అని రైతులంటే..నోటీసులు పంపాం..పేపర్లలో ప్రకటనలు ఇచ్చామని బ్యాంకర్లు సమర్ధించుకుంటున్నారు. పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన తమకు నోటీసుల విషయం తెలి యదని రైతులు వాపోతుంటే..అప్పటికే బంగారం బహిరంగ వేలం పూర్తికావడంతో తామేమీ చేయలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక రైతులు దిగాలు చెందుతున్నారు.
పరువు బజారు పాలవుతోంది..
పంటలు సాగు చేసుకుంటూ ఉన్నదాంట్లో పరువుగా బతుకుతున్న తాము..చంద్రబాబు హామీలు నమ్మి బజారు పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి సాకులు చూపుతూ రెండో జాబితా ప్రకటనలో జాప్యం, స్పష్టత లేక పోవటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని అంటున్నారు. రుణమాఫీలో అన్ని అర్హతలు ఉన్నాయని, రెండవ జాబితాలో తమ పేర్లు ఉంటాయన్న ధీమాతో ఉన్నామని ఈలోపు ప్రభుత్వం వైఫల్యం వలన తమ పరువు బ్యాంకర్లు తీస్తున్నారంటూ రైతన్నలు లబోదిబోమంటున్నారు. హామీలు ఇచ్చిన పాలకులు మాట మీద నిలబడకపోవటంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులను నిలువునా మోసం చేశారు
రైతులను భారీ ప్రకటనలతో, వార్తలతో ఎన్నికల సమయంలో నిలువునా మోసం చేశారు. నేడు ఒక్కరు కూడా రైతుల కష్టాలపై మాట్లాడిన దాఖలాలు లేవు. రుణమాఫీ పేరుతో రైతులకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.400 వ రకు ఖర్చులు అయ్యాయి. ఉపయోగం లేదు. -చెన్నారెడ్డి, రజానగరం
రైతుల నోట్లో మట్టే
రుణ మాఫీ చేస్తానని ప్రకటించి రైతులు ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం సరికాదు. రుణమాఫీ వెరిఫికేషన్ జాబితాల విషయంలో రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. తాజాగా పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తాన ని చెప్పటం చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాలకు నిదర్శనం. - ఐ.రమణారెడ్డి, కొత్తపాలెం
జమ చేసివా వేలం ఆగటం లేదు
చంద్రబాబు మాటలు విని రైతన్నలు పరువు పోగొట్టుకుంటున్నారు. పేపర్లలో పేర్లు వస్తే చూసుకొని బాధపడుతున్నారు. అప్పులు చేసి కొంత జమ చేసినా వేలం ఆగటం లేదు. సొమ్ము వచ్చిన తర్వాత జమ చేద్దామని బ్యాంకర్ల వద్దకు వె ళితే అప్పటికే వేలం వేసి ఉంటున్నారు. దీంతో రైతులు బాధలు వర్ణానాతీతం. రుణ మాఫీ సాధ్యం అంటూ ఊదర కొట్టిన వాళ్లు మాత్రం రైతుల కష్టాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. - అనిల్ కుమార్‌రెడ్డి, ఎన్‌బీపాలెం
వాయిదాలోపు చెల్లించకపోతే వేలం తప్పదు
బంగారంపై ఇచ్చిన రుణాలను వాయిదా లోపు చెల్లించకపోతే వేలం తప్పదు. ముందుగా లాయర్ నోటీసు పంపుతాం. తర్వాత పేపరు ప్రకటన ఇస్తాం. చివరిగా వేలం వేస్తున్నాం. రుణమాఫీ జాబితాలోకి అర్హత ఉండి ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తాం. ముందుగా రైతులకు తమ బకాయిలు ఎంత, రుణం ఎంత అన్న విషయాలపై స్పష్టత ఉండాలి. బ్యాంకర్లను నిందించటం తగదు.
- జగదీష్, ఏపీజీబీ మేనేజర్, తూర్పుగంగవరం.