
పల్లె క‘న్నీరు’ పెడుతోంది!
వాళ్లంతా నేల తల్లిని నమ్మిన రైతు బిడ్డలు. పుడమి కడుపును చీల్చుకుని పాతాళగంగ ఉబికి వచ్చిందంటే వారి కళ్లలో ఆనందానికి అవధులు ఉండవు. ఈ ప్రపంచాన్ని జయించినంతగా సంబరపడిపోతారు. కానీ గంగమ్మకు రైతన్నలపై కనికరం కలగలేదు. ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేకుండా పోతోంది.
పదుల సంఖ్యలో బోర్లు వేసి ఇక చేసేదేమీ లేక పొలాలను బీడుగా వదిలేస్తున్న రైతులకు లెక్కేలేదు. ఉన్న బోర్లలో నీరు తగ్గిపోవడం.. కొత్త బోర్లలో నీరు పడకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంతమంది రైతులు పంటలు పెట్టి.. దిగుబడులు రాక.. బోర్లు ఎండిపోయి ఏకంగా పొలాలను అమ్మి పట్టణాలకు వలసపోతున్నారంటే పల్లె ఎలా కన్నీరు పెడుతోందో అర్థం చేసుకోవచ్చు.
సాక్షి, పులివెందుల: లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామంలో 1300 మందికిపైగా జనాభా ఉంది. గ్రామంలో ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందరూ ఎక్కువగా వర్షాధార పంటనే నమ్ముకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా బోర్లు వేసి గ్రామంలో అరటి పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది వరకు గ్రామానికి సంబంధించి అరటి రైతులు మంచి దిగుబడిని సాధిస్తూ వచ్చినా.. ఈ ఏడాది మాత్రం గ్రామంలో అరటి రైతులకు అవస్థలు తప్పడం లేదు. గ్రామంలో ఒక బోరు మొదలుకుని 30 బోర్ల వరకు వేసిన రైతులు దాదాపు ఐదారు మంది ఉన్నారంటే అక్కడ పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు ఇట్టే అర్థమవుతాయి.
వందలాది బోర్లు వేసినా.. :
లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 400నుంచి 500బోర్లు వేసినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి మొదలైన నీటి కష్టం ఇప్పటికీగ్రామ రైతులకు తీరలేదు. వరుణ దేవుడు కరుణించి భారీ వర్షాలు కురిపిస్తే చుట్టు ప్రక్కల చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు, గుంతలు నిండి సమీపంలోని బోర్లల్లో భూగర్భజలాలు పెరిగి నీటి సమస్య ఉండదని రైతన్నలు భావిస్తున్నారు. సుమారు 800నుంచి 1200అడుగుల వరకు నీటి కోసం బోర్లు తవ్వినా.. నీటి చెమ్మ జాడ కనిపించడంలేదు. కొంతమంది రైతులు బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి పంటలను సాగు చేసి బోర్లను వేశారు. ప్రతి రైతు రెండు, మూడు, నాలుగు, ఐదు.. ఇలా పదుల సంఖ్యలో అరటిని కాపాడుకునేందుకు బోర్లు వేసుకుంటూ వచ్చారు.
వలసబాట పడుతున్న రైతన్నలు
తాతిరెడ్డిపల్లెకు చెందిన ఆదినారాయణ అనే రైతు తనకున్న 6ఎకరాల పొలంలో అరటి పంట సాగు చేశాడు. కొన్ని బోర్లు వేసినా.. ఫలితం సున్న. ఈ నేపథ్యంలో భారీ నష్టం రావడంతో చేసేదేమీ లేక ఉన్న ఇంటిని, కొంత భూమిని అమ్మి బెంగళూరుకు వలసబాట పట్టాడు. అక్కడ ఒక ప్రయివేట్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఒక్క రైతే కాదు.. మరికొంతమంది రైతులు వలసబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
అక్కడ చీనీ రైతులు.. ఇక్కడ అరటి రైతులు
పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన నీరు రాక సింహాద్రిపురం, తొండూరు, వేముల, పులివెందుల మండలాల్లో పలువురు రైతులు చీనీచెట్లను కొట్టివేస్తే.. తాతిరెడ్డిపల్లెలో అరటి రైతులు బోర్లల్లో నీరు అడుగంటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీబీసీకి నీరు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లల్లో నీరు ఇంకిపోయి పలువురు రైతులు చీనీ చెట్లను కొట్టివేస్తున్నారు.. అక్కడ.. ఇక్కడ రెండు చోట్ల నీరులేక రైతన్నలు తోటల్లో సాగు చేసిన చెట్లనే తెగనరుక్కోవాల్సిన పరిస్థితి రావడం బాధగా ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.