భూ సేకరణకు ఒప్పుకోం...
► భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన ఉండవల్లి రైతులు
► అధికారులపై విరుచుకుపడిన వైనం
► ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన రైతులు
ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : ‘మీ సూచనలు, సలహాలు మాకు అవసరం లేదు... చట్టాల్లో ఏముందో మాకు తెలుసు... సభలో మేమొకటి మాట్లాడితే... మీరొకటి రాసుకుంటారు... ఎవరో కొందరు స్వార్థపరులు చెప్పింది విని... మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు..’ అంటూ ఉండవల్లి గ్రామంలోని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గ్రామంలో సోమవారం నిర్వహించిన భూ సేకరణ సదస్సులో రైతులు అధికారులను నిలదీశారు. లాండ్ పూలింగ్ డెరైక్టర్ మోహనరావు మాట్లాడుతుండగా రైతులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణ కింద భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ‘సామాజిక సర్వేలు వద్దు, ఏమీ వద్దు మేము వ్యతిరేకిస్తున్నాం, అదే రాసుకోండి, వెళ్లండి’ అంటూ రైతులు అధికారులపై విరుచుకుపడ్డారు. భూములు ఇచ్చేది లేదంటూ 9.2 ఫారాలు అందజేసినా ఇంతవరకు వాటిపై సమాధానాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రైతులు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. చివరకు ల్యాండ్ పూలింగ్ డెరైక్టర్ మోహనరావు సమావేశాన్ని ముగిస్తున్నామంటూ పేర్కొన్నారు.
మినిట్‌బుక్ చూపించాలి...
రైతులు అధికారులను వదిలిపెట్టకుండా మీరు మినిట్స్ బుక్‌లో ఏం రాశారో మాకు చూపించాలంటూ పట్టుబట్టారు. భూ సేకరణకు వేసే కమిటీలో రైతులను కూడా సభ్యులను చేయాలంటూ సూచించామని, అది ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రభుత్వం భూసేకరణకు వెళితే, ముఖ్యమంత్రి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. సర్పంచ్ మన్నెం సుజాత సైతం రాజధాని నుంచి మా ఊరును తొలగించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీలోనూ, మండల పరిషత్ కార్యాలయంలోనూ ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.