నక్కపల్లి(విశాఖ)/రామభద్రపురం : విశాఖ జిల్లాలో రైలు నుంచి జారిపడి తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. మృతులు స్వగ్రామం విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ. వీరు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని జొన్నాడలో ఇటుకల తయారీ పరిశ్రమలో పనికి రెండు నెలల క్రితం వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి తిరిగివస్తుండగా రైలు నుంచి జారిపడి దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన అగతాని వెంకటరావు అలియాస్ వెంకటి(47) ముగ్గురు పిల్లలు, భార్యతోకలసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని జొన్నాడలోని ఇటుకల తయారీ పరిశ్రమలో పనికి వెళ్లారు. అక్కడ రెండు నెలలపాటు పని చేశారు.
పనులు ముగిశాక స్వగ్రామానికి బయల్దేరారు. బుధవారం రాత్రి రాజమండ్రిలో రెలైక్కారు. రద్దీగా ఉండడంతో భార్య, ఇద్దరు పిల్లల్ని కంపార్టుమెంట్ మధ్యలో కూర్చోబెట్టి వెంకటరావు, పెద్ద కొడుకు నవీన్(17) గేటు వద్ద కూర్చున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని గుల్లిపాడు రైల్వేస్టేషన్ సమీపానికి వచ్చేసరికి తెల్లవారుజాము అయింది. ఆ సమయంలో నిద్రమత్తులో వెంకటరావు కుమారుడు నవీన్(17) జారిపడ్డాడు. కుమారుడిని రక్షించే ప్రయత్నంలో వెంకటరావు కూడా పడిపోయాడు. ఈ ఘటనలో ఇరువురి శరీరాలు రైలు కిందకు పడిపోవడంతో తునాతునకలయ్యాయి. రైలులోని వారు ఈ విషయం భార్య బంగారమ్మకు చెప్పడంతో ఆమె తనవద్ద ఉన్న ఇద్దరు చిన్నపిల్లలతో నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్‌లో దిగి తుని రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
నాలుగు గంటల్లో సొంతూరికి చేరుకుంటారనగా..
పొట్టకూటికోసం వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తూ మరో నాలుగు గంటల్లో సొంతూరికి చేరుకునే సమయంలో వెంకటరావు, కొడుకు నవీన్ రైలు నుంచి జారిపడి దుర్మరణం చెందడం అందరినీ కలచివేసింది. కళ్లముందే భర,్త అందివచ్చిన కొడుకు చనిపోవడాన్ని భార్య బంగారమ్మ తట్టుకోలేకపోతోంది. మతి స్థిమితం కోల్పోయిన దానిలా మాట్లాడుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఫోన్‌లో బంధువులకు వివరాలు చెప్పడానికి కూడా ఆమె నోటి మాట రాలేదు. ఇది అక్కడి వారినందరినీ కంటతడి పెట్టించింది. గుల్లిపాడు స్టేషన్ సిబ్బంది ఈ ఘటనపై తుని రైల్వేపోలీసులకు సమాచారం ఇచ్చారు. జీఆర్పీ ఎస్‌ఐ వై.రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని తెగిపడిన తండ్రీకొడుకుల మృతదేహాలను పరిశీలించారు. వాటిని పోస్టుమార్టానికి తుని ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద సెల్‌ఫోన్, రాజమండ్రి నుంచి విజయనగరానికి తీసుకున్న రైలు టికెట్టు ఉన్నాయి. సెల్‌ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.
స్వగ్రామంలో విషాదఛాయలు
సంఘటన విషయం తెలిసి మృతుల స్వగ్రామం కొండకెంగువ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొండకెంగువ గ్రామంలో హరిజన కాలనీలో ఉంటున్న మృతుడు వెంకటరావు సోదరులు చిన్నయ్య, సింహాచలం, పోలయ్యలు భోరున విలపించారు. మృతుడు వెంకటరావుకు భార్య బంగారమ్మతోపాటు, కుమారులు నవీన్, ప్రేమ్‌కుమార్, కుమార్తె దీవెన ఉన్నారు. ప్రమాద ఘటనలో వెంకటరావుతోపాటు కుమారుడు నవీన్ మృతి చెందారు.
కన్నపేగును కాపాడబోయి..
Published Fri, May 29 2015 3:32 AM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM
Advertisement
Advertisement