- ఇంట్లోకి చొరబడి కొంత మంది వ్యక్తుల బీభత్సం
- డిప్యూటీ రిజిస్ట్రార్ హరిణి భర్త కుమారస్వామితో దురుసు ప్రవర్తన
- తమతో తెచ్చిన కాగితాలపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి
- ఆగంతకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారస్వామి
- ప్రస్తుతం ప్రసవం కోసం ఆస్పత్రిలో ఉన్న హరిణి
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ హైకోర్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’కి సంబంధించిన ఫైళ్ల వివాదం మరింతగా ముదురుతోంది.. ఆ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన తనపై ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు పాల్పడుతున్నారని సహకారశాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ పి.హరిణి ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రికార్డుల కోసం హరిణి నివాసానికి కొంత మంది వ్యక్తులు వచ్చి, బీభత్సం సృష్టించడంతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది.
తమ ఇంట్లో కొంత మంది ఆగంతకులు ప్రవేశించి బీభత్సం సృష్టించారని హరిణి భర్త కుమారస్వామి జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. నిండు గర్భిణి అయిన హరిణి ప్రస్తుతం ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. ప్రసవం కోసం ఆమె ఆస్పత్రిలో చేరడంతో... ఆగంతకులు వచ్చిన సమయంలో ఆమె భర్త మాత్రమే ఇంట్లో ఉన్నారు.
పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం కుమారస్వామి విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో ఉన్న హరిణి నివాసంలోకి గురువారం ఉదయం ఆరుగురు వ్యక్తులు దౌర్జన్యంగా చొరబడ్డారు. వెంటనే గదులన్నింటినీ గాలించడం మొదలుపెట్టారు. నిండు గర్భంతో ఉన్న తన భార్య హరిణి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిం దని కుమారస్వామి చెప్పినా వినిపించుకోకుండా... వచ్చిన వాళ్లు ఫైళ్లకోసం ఇంట్లోని టేబుళ్లన్నీ వెతికారు. ఆ తర్వాత వారు తమతో పాటు తీసుకువచ్చిన కాగితాల మీద సంతకాలు పెట్టాలంటూ కుమారస్వామిపై ఒత్తిడి చేశారు.
అసలు మీకు ఏం కావాలని ప్రశ్నించగా... హైదరాబాద్ జిల్లా సహకారశాఖ అధికారి దశరథ రామయ్యతో కుమారస్వామిని ఫోన్‌లో మాట్లాడిం చారు. ఓ అధికారి ఆదేశాల మేరకు సంతకాల కోసం పంపించామని దశరథ రామయ్య కుమారస్వామికి చెప్పారు. కానీ కుమారస్వామి ఆ పత్రాలపై సంతకాలు చేయకపోవడంతో ఆగంతకులు ఇంటి బయట ఓ నోటీసును అతికించి వెళ్లిపోయారు.