మింగుడుపడని నల్ల బెల్లం
=ముసురుకున్న వివాదాలు
=వ్యాపారులపై ఎక్సైజ్ పోలీసులుహడావుడి
=అనకాపల్లి మార్కెట్‌లో నిలిచిపోయిన లావాదేవీలు
=శాశ్వత పరిష్కారానికి రైతుల డిమాండ్
అనకాపల్లి,న్యూస్‌లైన్: నల్లబెల్లం వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రశాంతంగా సాగుతున్న దీని లావాదేవీలపై ప్రభావం కనిపిస్తోంది. దీంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి మార్కెట్‌లో సోమవారం అమ్మకాలు,కొనుగోలు నిలిచిపోయాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ సమస్య పరిష్కారంలో పాలకుల్లో చిత్తశుద్ధికొరవడి రైతులు నష్టపోతున్నారు. వాస్తవానికి బెల్లం రంగును ఎవరూ నిర్ధారించలేరు. వాతావరణం, వంగడం,ఎరువుల వినియోగం, భూసారం, బెల్లం వండే విధానాలు రంగును ప్రభావితం చేస్తాయి.
కావాలని ఏ రైతూ నల్లబెల్లాన్ని తయారు చేయడు. ఇక్కడి మార్కెట్‌లో బెల్లాన్ని రంగునుబట్టి కేటగిరి వారీగా క్రయ విక్రయాలు జరుపుతారు. నల్లబెల్లాన్ని మూడోరకంగా గుర్తిస్తారు. గతంలో ఈ రకంపై ఎక్సైజ్ పోలీసులు ఆంక్షలు విధించినప్పుడు, దాని రవాణాను అడ్డుకున్నప్పుడు వర్తకులు సంఘటితంగా పోరాడిన సందర్భాలున్నాయి. మళ్లీ ఇప్పుడు ఇదే అంశం వివాదస్పదమవుతోంది. నల్లబెల్లం వివరాలు చెప్పాలని, ఎవరికి అమ్ముతున్నారో తెలపాలంటూ ఎక్సైజ్ అధికారులు వివిధ జిల్లాల్లోని బెల్లం మార్కెట్‌యార్డులలో లావాదేవీలు జరిపే వర్తకులకు తాఖీదులు పంపారు.
దీనికి తోడు నల్లబెల్లంతో తయారుచేసే సారాను సాకుగా చూపి వర్తకులపై సైతం కేసులు నమోదుకు అత్యుత్సాహం చూపడంతో వర్తకులు మండిపడుతున్నారు. ఈమేరకు అనకాపల్లి మార్కెట్‌లో సుమారు రెండువేల క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు సోమవారం నిలిపివేశారు. యార్డు అంతా వెలవెలబోయింది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు కారణంగా ఈ మార్కెట్‌లో పలుమార్లు లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉండగా అనకాపల్లి మార్కెట్‌యార్డులో గతేడాది నుంచి నల్లబెల్లం కొనుగోలుకు మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. క్వింటా రూ.2700లకు కొనుగోలు చేస్తే మార్క్‌ఫెడ్‌కు కోనుగోలు ధర తగ్గుతుంది. రైతులకు గిట్టుబాటు ధరతో మేలు చేసినట్లు ఖ్యాతి దక్కుతుంది. తక్షణం మార్క్‌ఫెడ్ అధికారులు స్పందించి నల్లబెల్లం సమస్యను పరిష్కారించాలని వర్తకులు, రైతులు కోరుతున్నారు.
నల్లబెల్లం మొత్తం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి...
అనకాపల్లి అగ్రికల్చరల్ మార్కెట్‌యార్డుకు వచ్చిన నల్లబెల్లం మొత్తం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని వర్తకుల సంఘం ప్రతినిధులు ఏఎంసీ అధికారులకు సోమవారం లేఖ అందజేశారు. రైతుల నుంచి రెండు శాతం లోపే నల్లబెల్లం సేకరిస్తున్నామని,ఎక్సైజ్ అధికారుల పోకడలతో లావాదేవీలు నిలిచిపోయి రైతులు నష్టపోయే ప్రమాదముందని అందులో పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నల్లబెల్లం కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో లాభం చేకూరుతుందన్నారు. ఈ లేఖను హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనర్, మార్క్‌ఫెడ్ అధికారులు, జిల్లా కలెక్టర్,అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఫెడరేషన్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ వారికి పంపుతున్నట్టు ఏఎంసీ అధికారులు తెలిపారు.