నెలాఖరుకల్లా ఐఏఎస్‌ల తుది పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువుగా ఉన్న 13 మంది తెలంగాణకు
రోస్టర్ విధానంలో కేటాయింపు
హైదరాబాద్: ఐఏఎస్‌ల తుది పంపిణీని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి ప్రత్యూష సిన్హా కమిటీ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఆ మార్గదర్శకాల మేరకు ఐఏఎస్‌ల తుది పంపిణీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చేయనుంది. తాత్కాలికంగా తెలంగాణకు 41 మంది ఐఏఎస్‌లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మిగతా ఐఏఎస్‌లందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో శాఖలకు ఐఏఎస్ అధికారులు లేక పరిపాలన సాగడం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ఐఏఎస్‌లు ఖాళీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా ఐఏఎస్‌ల పంపిణీని పూర్తి చేయాలని ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయించింది.
ఆ కమిటీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డెరైక్ట్ రిక్రూటీ ఐఏఎస్‌ల్లో 13 మంది ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఎక్కువగా ఉన్న వారిని రోస్టర్ విధానంలో తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఐఏఎస్‌ల సంఖ్య ఎంత అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన విషయం తెలిసిందే. జిల్లాల నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులను, తెలంగాణకు 163 ఐఏఎస్ పోస్టులను కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే.