రగిలిన అంగన్‌వాడీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముట్టడి
- మాట తప్పిన చంద్రబాబుపై మండిపడ్డ మహిళలు
సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారుపై అంగన్‌వాడీ మహిళల్లో ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమంలో బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను ఊడబెరుకుతున్నారంటూ మహిళలు మండిపడ్డారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఐకేపీ యానిమేటర్లు, ఆశా వర్కర్లు, గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు ఆందోళనల్లో పాల్గొన్నారు. అంగన్‌వాడీలకు నెలకు రూ.పదివేల వేతనం, అర్హులకు సూపర్‌వైజర్ పోస్టులను ఇవ్వాలని కోరారు.
ఇప్పుడే ప్రకటన చేయాలి: రాఘవులు
అంగన్‌వాడీలకు, కాంట్రాక్టు కార్మికులను న్యాయం జరిగేలా ప్రస్తుత శాసన సభ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీల ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల హామీకి కట్టుబడి రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.బాబు సీఎంగా వ్యవహరించడంలేదన్నారు. సింగపూర్, జపాన్, బడా పెట్టుబడిదారులు, ప్రైవేట్ సంస్థలకు సీఈవోగా మారిపోయారని ఎద్దేవా చేశారు.
మూడు నెలలుగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధర్నాలో పొల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఆందోళనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత..
ప్రకాశం జిల్లాలో కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్‌వాడీలు, సీఐటీయు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని ప్రతిఘటించడంతో తొక్కిసలాట జరిగి ఓ అంగన్‌వాడీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అంగన్‌వాడీలు, ఐకేపీ యానిమేటర్లు రాకుండా సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు.
వైఎస్సార్ జిల్లాలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలో ఆందోళనకు దిగిన అంగన్‌వాడీలు తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సంఘీభావం తెలిపారు. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోను ఆందోళన చేశారు.