తొలి విడత సమరం
- జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
- 182 సమస్యాత్మక,140 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
- 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 225 మంది వీడియోగ్రాఫర్ల ఏర్పాటు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తొలి విడత ప్రాదేశిక పోరులో ఓటర్ల నిర్ణయం ఆదివారం వెలువడనుంది. సుదీర్ఘకాలం తరువాత జరగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా ఓటర్లు ఎక్కువగా ఉంటే క్యూలో ఉన్నవారందరికీ స్లిప్పులు అందజేస్తారు. వారిని మాత్రమే ఓటేయడానికి అనుమతిస్తారు. గత నెల రోజులుగా ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థుల జాతకాలు బ్యాలెట్ బాక్సుల్లోకి చేరనున్నాయి. పోలింగ్ కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తొలి దశలో 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీలకు 88 మంది, ఎంపీటీసీలకు 912 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 9,65,504 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 4,75,395 మంది పురుషులు, 4,90,108 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 1177 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2397 బ్యాలెట్ బాక్సులను వినియోస్తున్నారు. ఎన్నిల నిర్వహణకు 1295 మంది పీవో, 3883 మంది ఏపీవో, 1295 మంది ఓపీవో మొత్తంగా 6,473 మంది సిబ్బందిని నియమించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత
విశాఖ,అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో పోలింగ్ జరిగే 22 మండలాల్లో 182 సమస్యాత్మక, 140 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని 395 పోలింగ్ కేంద్రాలకు ఒక్కోదానికి నలుగురు,అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోని 366 పోలింగ్ కేంద్రాలకు ఒక్కోదానికి ఐదుగురు చొప్పున పోలీసు బందోబస్తు ఏర్పాటు చే స్తున్నారు. ఈ ఎన్నికలకు విశాఖ పోలీస్ కమిషనర్ పరిధిలో 1200, రూరల్ ఎస్పీ పరిధిలో 3100 మంది పోలీసులను వినియోగిస్తున్నారు.
29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు 29 కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం లేని 225 కేంద్రాల్లో పోలింగ్‌ను వీడియో తీసేందుకు వీడియోగ్రఫర్లను, స్టాటిక్ ఫోర్స్‌ను నియమించారు. 68 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు.
రెవెన్యూ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మే7వ తేదీ తరువాత జరగనుంది. దీంతో అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో భద్రపర్చాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. విశాఖ డివిజన్ కు శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లోను, అనకాపల్లి డివిజన్‌కు ఏఎంఏఎల్ కళాశాలలోను, నర్సీపట్నం డివిజన్‌కు డాన్‌బాస్కో స్కూల్‌లోను స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు.