
జేబు దొంగలనూ పసిగడుతుంది!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి డ్రోన్ కెమెరా నిఘా వాహనం
తిరుపతి అర్బన్: రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు వ్యవస్థలోనే తొలి డ్రోన్, వైర్‌లెస్ కెమెరా నిఘా వాహనాన్ని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు శుక్రవారం పరిశీలించారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఈ వాహనం ప్రయోగాత్మక పరిశీలన నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ టీటీడీ సీవీఎస్‌వో, చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ చొరవతో రూపొందించిన ఈ వాహనం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిదని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 25 వేల మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలోనూ ప్రతి అణువూ గుర్తించేలా సాంకేతిక పరిజ్ఞానం పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చిందన్నారు.
వీఐపీల పర్యటనలు, ర్యాలీలు, సభల్లో ఎవరైనా పాత నేరస్తులు, సంఘ విద్రోహులు, చివరకు జేబుదొంగలు సైతం సులభంగా పట్టుపడే విధంగా కెమెరా నిఘా వ్యవస్థ ఏర్పాటైందన్నారు. ఈ వాహనంతో భవిష్యత్‌లో పోలీసుశాఖతో పాటు ఇతర ప్రభుత్వ, పోలీసు అనుబంధ శాఖలకు కూడా వ్యాపార ధృక్పథంతో సేవలందించేందుకు వినియోగిస్తామన్నారు.