సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తానెక్కిన కొమ్మను తానే నరుక్కుంది. ఫలితంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ అధిష్టానం తీరు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, పార్టీ రాజకీయ భవిష్యత్‌ను చేతులారా దెబ్బతీసిన కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలే తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన మాజీ మంత్రి, అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతల్లో తొలి రాజీనామా అస్త్రాన్ని బుద్ధప్రసాద్ సంధించారు. సోనియా తీరుపై ఆయన రాసిన బహిరంగ లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కాంగ్రెస్‌లో పెద్ద దిక్కుగా ఉన్న బుద్ధప్రసాద్ కాంగ్రెస్‌ను వీడటంతో మరికొందరు నేతలు ఆయన బాటలో పయనించే అవకాశం ఉందని అంటున్నారు.
బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ శుక్రవారం అవనిగడ్డలో ముఖ్యనేతలు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించి రాజీనామా నిర్ణయం ప్రకటించారు. పలువురు తమ రాజీనామా లేఖలను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో డీసీపీ అధికార ప్రతినిధి రేమాల సుబ్బారావు (బెనర్జీ), డీసీసీ ఉపాధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు, కేడీసీసీ డెరైక్టర్ ముద్దినేని చంద్రరావు, మార్క్‌ఫెడ్ డెరైక్టర్ మోరాల సుబ్బారావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకా కొండలు, అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, చల్లపల్లి మండలంలోని 60 మంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి అన్నే చిట్టిబాబు, డీసీసీ కార్యదర్శి చిరుమామిళ్ల రాజా, కాంగ్రెస్ పెనమలూరు మండల అధ్యక్షుడు చిగురుపాటి దామోదర్‌లు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
మైలవరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోడా మల్లికార్జునరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ తీసుకున్న చర్యలను చూసి పది రోజుల క్రితం పీసీసీ సభ్యుడు, గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ నుగలాపు వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వారి బాటలో మరికొందరు నేతలు పయనించే అవకాశం ఉంది.
లగడపాటి, సారథిపై విమర్శలు...
జిల్లాకు చెందిన ఎంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రి కొలుసు పార్థసారథితో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 65 రోజులుగా ఉద్యమం సాగుతుంటే జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఢిల్లీ, హైదరాబాద్‌లో దాక్కున్నారని ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తాజాగా తెలంగాణ నోట్ వెలువడటంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను జిల్లాలో అడుగుపెట్టనిచ్చేదిలేదని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు.
విజయవాడ సిటీ కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి...
జిల్లాలో కాంగ్రెస్‌కు చెడుకాలం దాపురించిన సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై విజయవాడ సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు కార్యకర్తలు సమావేశం నిర్వహించాలన్న యోచనకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు బ్రేక్ వేసినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ అంటే ప్రజలు ఆగ్రహంతో రగలిపోతున్నారని, కాంగ్రెస్ శ్రేణులు సమావేశాలు నిర్వహించడం సరికాదని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే వన్‌టౌన్‌లోని మరుపిళ్ల చిట్టి కార్యాలయానికి కార్యకర్తలు తాళాలు వేసి కాంగ్రెస్ బోర్డుపై వస్త్రాలు కట్టారు. కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుందని సమాచారం అందుకున్న ఏపీ ఎన్‌జీవోలు శుక్రవారం విజయవాడ సిటీ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర విభజనకు తెగించిన కాంగ్రెస్ పార్టీపై ఏపీ ఎన్‌జీవోలు తీవ్రంగా విమర్శలు చేశారు.
కాంగ్రెస్ కుదేల్
Published Sat, Oct 5 2013 1:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement