మృత్యు గేట్లు | The gates of death | Sakshi
Sakshi News home page

మృత్యు గేట్లు

Published Fri, Jul 25 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

The gates of death

రాజంపేట: జిల్లాలోని పలుప్రాంతాల్లో కాపలా లేని రైల్వేగేట్లు ఉండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం ప్రజల్ని వెంటాడుతోంది. రైల్వేకోడూరు మొదలుకుని ఎర్రగుంట్ల వరకు 8 చోట్ల ఇలాంటి రైల్వే గేట్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో కాపలా లేని రైల్వేగేటు వద్ద స్కూల్ వ్యానును రైలు ఢీకొన్న సంఘటనలో పలువురు చిన్నారులు మృత్యువాత పడిన నేపథ్యంలో కాపలా లేని రైల్వేగేట్లు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం ఆ తర్వాత మిన్నకుండిపోవడం రైల్వే అధికారులకు పరిపాటిగా మారింది.  
 
 ముంబయి-చెన్నై కారిడార్‌లో జిల్లా పరిధిలో నందలూరు, కడప, రైల్వేకోడూరు, ఎర్రగుంట్ల రైల్‌ట్రాక్ సెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 8 కాపలాలేని లెవల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. గతంలో 20 గేట్లు ఉండేవి, వాటిలో కొన్నింటిని మూసివేయడంతో పాటు మరికొన్నింటికి మనిషిని కాపాలా ఉంచారు. జిల్లాలో ఇంకా 8 చోట్ల మనిషి కాపలా లేని గేట్లు ఉన్నాయి.
 
 మనిషి కాపలా లేని గేట్ల వద్ద భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కన్నుమూసి తెరిచేలోపు పట్టాలపై వెళుతున్నవారిని రైళ్లు కబళిస్తున్నాయి. తరచూ ఈ క్రాసింగ్‌ల వద్ద రెలుపట్టాలు దాటుతూ మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. అయితే రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద  కాపలా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కారు కూడా సగం ఖర్చు భరించాలని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రైల్వే క్రాసింగ్‌లను ఆధునీకరించేలా, కాపలా వ్యక్తులను నియమించేలా  ప్రజా ప్రతినిధులు రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  
 
 జిల్లాలో ఎక్కడున్నాయంటే ...
 కడప, ఎర్రగుంట్ల సెక్షన్ పరిధిలో కృష్ణాపురం-గంగాయపల్లె మధ్య రెండు, గంగాయపల్లె-కమలాపురం మధ్య రెండు, ఎర్రగుడిపాళెం-ఎర్రగుంట్ల మధ్య ఒకటి, కోడూరు-అనంతరాజుపేట మధ్య ఒకటి, పుల్లంపేట-రాజంపేట మధ్య ఒకటి, హస్తవరం-రాజంపేట మధ్య ఒక చోట మనిషి కాపలా లేని గేట్లు ఉన్నాయి.  
 
 ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు నాలుగు ప్రమాదాలు జరిగాయని రైల్వే వర్గాల అధికారిక సమాచారం. రైళ్లు ఢీకొన్న వాటిలో అధికంగా ఆటోలు, ట్రాక్టరు ఉన్నాయి. 2010లో పుల్లంపేట మండలంలోని అప్పయ్యరాజుపేట వద్ద ఆటోను  ప్యాసింజర్ రైలు ఢీకొంది. అయితే తృటిలో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత అప్పయ్యరాజుపేట గ్రామస్తుల విన్నపాన్ని పరిశీలించిన రైల్వేశాఖ అధికారులు ఆ క్రాసింగ్‌ను మనిషి కాపలా ఉండే గేటుగా మార్చారు.
 
 కాపలా లేని గేట్లకు స్వస్తి ఎప్పుడో?
 జిల్లాలో మనిషి కాపలా లేని రైల్వే గేట్లకు రైల్వే శాఖ ఎప్పుడు స్వస్తి పలుకుతుందో తెలియనిపరిస్ధితి. కొన్నిచోట్ల వివిధ కారణాలు చూపి పూర్తిగా మనిషి కాపలా లేనిగేట్లను మూసివేస్తున్నారు. దీని వల్ల ఆ ప్రాంతంలో రాకపోకలకు గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గేట్‌మెన్‌లు లేని లెవల్ క్రాసింగ్‌లు అధికంగా గ్రామాలకు సమీపంలో ఉండటం వల్ల ఆధునీకరించి విడతలవారీగా వాటి వద్ద గేట్‌మెన్‌లను నియమిస్తామని బడ్జెట్ ప్రతిపాదనల్లో రైల్వే మంత్రులు పేర్కొంటూవస్తున్నారు. రైల్వే శాఖ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నప్పటికి స్వల్ప ఖర్చుకు వెనకడుగు వేస్తూ  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
 
 బండి వచ్చేది కూడా తెలియడం లేదు
 బండి వచ్చేది కూడా తెలియడం లేదు. గతంలో రైళ్లు వస్తుంటే తెలిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరెంట్ ఇంజన్‌లతో రైళ్లు నడుస్తున్నాయి. గేటు చూసుకుని దాటుకోవాల్సి వస్తుంది. లేకుంటే ప్రాణాలు తెలియకుండానే పోతాయి. మనిషి కాపలా లేని గేటు వల్ల ఇబ్బంది పడుతున్నాం.
 -రామయ్య,పుల్లంపేట మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement