నమ్మకంగా భూములను సమీకరించారు
ఇప్పుడేమో కంటికి కనిపించకుండా తప్పుకుంటున్నారు
నవులూరు జన్మభూమి గ్రామ సభలో గందరగోళం
నవులూరు (మంగళగిరి రూరల్) : రాజధాని పరిధిలోని గ్రామ ప్రజలను, రైతులను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని, నమ్మకంగా భూములు సమీకరించిన మంత్రులు ఇప్పుడు కనిపించకుండా తప్పుకు తిరుగుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఈపూరి ఆదామ్, పచ్చల శ్యామ్‌బాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నవులూరు పంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ బాణావత్ బాలాజీ నాయక్ అధ్యక్షతన జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామ సభ గందరగోళంగా సాగింది. సభలో వైఎస్సార్ సీపీ నేతలు సమస్యలపై అధికారులను నిలదీశారు. దేవస్థాన భూములను అమ్ముకున్న వ్యక్తులు గ్రామాన్ని దత్తత తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని బత్తుల భాస్కర్ అధికారులను ప్రశ్నించారు. గ్రామ రైతులు ఇప్పటికే మూడు మార్లు భూములు ఇచ్చారని, ఒక మారు ఉడా వారు సేకరించారని, మరో మారు రోడ్డు విస్తరణకు సేకరించారని, తాజాగా రాజధాని నిర్మాణానికి భూములను సమీకరించారని ఈపూరి ఆదామ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మూడు మార్లు భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదన్నారు. భూములిచ్చిన రైతులకు ప్యాకేజీ ప్రకటించకుండా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసి ‘ఎక్స్‌ప్రెస్ వే’ల పేరుతో ఇళ్లను తొలగించాలని ప్రయత్నించడం ఏమిటని పచ్చల శ్యామ్‌బాబు ప్రశ్నించారు.
అంతే కాకుండా గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు పింఛన్లు మంజూరు, రేషన్ కార్డుల బదిలీ వ్యవహారాల్లో జరుగుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
రాజధాని గ్రామ ప్రజలను మోసగించిన ప్రభుత్వం
Published Fri, Jan 8 2016 12:09 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement