పాలమూరు, న్యూస్‌లైన్: పేదల సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం చేతల్లో చూపించడం లే దు. రచ్చబండ రెండుసార్లు, ప్రజాపథం మూ డుసార్లు నిర్వహించి ఆ కార్యక్రమాల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు ఇంతవరకు అతీగతిలేదు. ఇళ్లు, పింఛన్లు, ఇతర సమస్యల పరిష్కారం ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మూడోవిడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. జి ల్లాలో 2011 జనవరిలో మొదటి విడత చేపట్ట గా.. రెండో విడత రచ్చబండ కార్యక్రమాన్ని అ దే ఏడాది నవంబరులో చేపట్టింది.
అప్పట్లో లక్షల్లో దరఖాస్తులు తీసుకున్న అధికారగణం వాటిని వేలల్లో కూడా పరిష్కరించలేకపోయింది. మూడోవిడత కార్యక్రమం చేపట్టే నాటికి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొనడంతో ప్రజలు తమ సమస్యల పరిష్కార ం కోసం పడిగాపులు గాస్తున్నారు. గత రెండు రచ్చబండ కార్యక్రమాల్లో ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులకు లక్షలాది దరఖాస్తులు వచ్చినా అందులో పరిష్కారానికి నోచుకున్నవి తక్కువే. వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్ ఉన్నవాటిని అధికారులు ‘ఆన్‌లైన్’ చేయడం తప్ప ఈలోగా అర్జీదారులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారు. రెండు విడతల రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం 1.90 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా, వాటిలో 60వేల దరఖాస్తులను తిరస్కరించారు. మిగతావాటిని ఇప్పుడు చేపట్టనున్న కార్యక్రమం ద్వారా లబ్ధి కల్పించనున్నారు. పింఛన్ల కోసం 1.50 లక్షల దరఖాస్తులు అందగా.. కేవలం 70వేల మందికి మాత్రమే అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పేద కుటుంబాలకు చెందిన వారు 95వేల దరఖాస్తులు అందజేయగా.. 55వేల ఇళ్లకు మాత్రమే మంజూరు లభించింది.
వారిలోనూ ఎంతమందికి పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు చేస్తారన్నది అయోమయంగా మారింది. అసలు విషయమేమిటంటే.. ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో సరైనలెక్కలు కూడా లేకపోవడంతో ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందో తెలియడం లేదు. ఇళ్లు మంజూరు చేయాలంటే సదరు లబ్ధిదారునికి కచ్చితంగా రేషన్‌కార్డు, స్థలం ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఇల్లు మంజూరు చేసే అవకాశం లేదు. ఇళ్లకు అర్హత సాధించిన వారిలో చాలామందికి రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు.
ప్రజల నుంచి వ్యతిరేకత
2011 జనవరిలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామీణస్థాయిలో నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్రస్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కారణంగా అదేఏడాది నవంబర్‌లో నిర్వహించిన కార్యక్రమాన్ని మండలస్థాయికి మార్చారు. నేటి నుంచి చేపట్టనున్న మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామాల్లోనూ చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రచ్చబండ ద్వారా సర్కారు ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చనుందో వేచిచూడాలి.
పింఛన్ కోసం తిరుగుతున్నా..
నాలుగేళ్ల క్రితం ఒక కాలు ను పూర్తిగా కోల్పోయా. కుటుంబ పోషణ భారమవ్వడంతో పింఛన్ కోసం రచ్చబండలో దరఖాస్తు చేసుకున్నా. కానీ ఇంత వరకు మంజూరు చేయలేదు. అధికారులు చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయా. దీంతో నేను పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పింఛన్ మంజూరుచేయండి.
-సత్యనారాయణ,
బండర్‌వల్లి, సీసీ కుంట మండలం
ఇళ్లు మంజూరుచేయండి
8ఏళ్ల క్రితం పక్షవాతం రావడంతో ఏ పనిచేసేందు కు చేతకావడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉన్న ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డాం. ఇళ్లు మంజూరుచేయమని అడిగితే పట్టించుకునేవారు లేరు. నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇళ్లు మంజూరు చేసి ఆదుకోండి.
-మహేందర్,
అంకిళ్ల, కోయిల్‌కొండ మండలం
అటకెక్కిన అర్జీలు
Published Mon, Nov 11 2013 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement