ఉదయగిరి, న్యూస్‌లైన్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది పంచాయతీల్లో పాలన పరిస్థితి. ప్రత్యేకాధికారుల పాలనతో పల్లెల్లో సమస్యలు పేరుకుపోవడంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్‌లు అధికారం చేపట్టడంతో ఇక సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని గ్రామీణ ప్రజలు భావించారు. అయితే పరిస్థితి గతంలో కన్నా దారుణంగా తయారవడంతో జనం కష్టాలు పడుతున్నారు. జిల్లాలో 931 పంచాయతీలున్నాయి. వీటిలో 927 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 203 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ఇంకా విడుదల కాలేదు.
వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించే ఉద్దేశంతో మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ పంచాయతీలకు రూ.5 లక్షలు అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.15 లక్షలు, రూ.7 లక్షలుగా నిర్ణయించినా ఇంతవరకు విడుదల చేయలేదు. జిల్లాలోని ఆత్మకూరు డివిజన్‌లో 37, కావలిలో 32, నెల్లూరులో 53, గూడూరులో 38, నాయుడుపేటలో 37 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నిధులు మంజూరైతే ఏకగ్రీవ పంచాయతీల్లోనైనా అభివృద్ధి పనులు సజావుగా సాగే అవకాశముంది.
నిధుల కోసం ఎదురుచూపులు
పంచాయతీల్లో ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల నిధులతోనే పనులు చేయాల్సి ఉంటుంది. ఆర్థికసంఘం, తలసరి గ్రాంటు, ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజు, సీనరేజ్, పారిశుధ్యం నిధులు, ఇంటిపన్ను ద్వారా వచ్చే నిధులు పంచాయతీ ఖాతాల్లో జమవుతుంటాయి. ఈ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. రెండేళ్లనుంచి పాలకవర్గాలు లేకపోవడంతో 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది.
ఈ నిధులే జిల్లాకు రూ.20 కోట్ల వరకు రావాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల కాలేదు. పంచాయతీ ఖాతాలో చిల్లిగవ్వ లేకపోవడంతోఎక్కువ మంది సర్పంచ్‌లు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోవున్నారు. కొందరు సర్పంచ్‌లు మాత్రం సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులతో చేపడుతున్న పనులకు పాలకవర్గం సమావేశంలో ఆమోదం లభిస్తుందో, లేదోననే భయం కూడా సర్పంచ్‌లను వెంటాడుతోంది.
సమస్యల తిష్ట
నిధులు లేక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇటీవ ల తరచూ వర్షాలు కురుస్తుండటంతో వీధులన్నీ బురదమయమయ్యాయి. పారిశుధ్యం లోపించి వ్యాధులు ప్రబలుతున్నాయి. వీధిలైట్లు లేక పల్లెల్లో చీకట్లు కమ్ముకున్నాయి. విషపురుగుల భయంతో సాయంత్రమైతే ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. కళ్ల ముందే సమస్యలు తీవ్రంగా ఉన్నా సర్పంచ్‌లు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.
సమ్మెలో అధికారులు:
నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేయడంతో సీమాంధ్రలో ఉద్యమం హోరుగా సాగుతోంది. ఉద్యమంలో అటు ఉద్యోగులు, అధికారులు భాగస్వామ్యులు కావడంతో నిధుల విడుదలపై తీవ్ర ప్రభావం పడింది. ఖజానా ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతుండడంతో బిల్లుల ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది.
నిధులు విడుదల చేయాలి
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ నిధులు వెంటనే విడుదల చేయాలి. పంచాయతీల్లో పనులు చేసేందుకు పైసా కూడా నిధులు లేవు. గ్రామాల్లో పారిశుద్యం అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తే పనులు చేపట్టే అవకాశముంది.
ఇమ్మానుయేలు, డక్కునూరు, వరికుంటపాడు మండలం
పైసా లేదు
రెండు నెలల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టినా పనులు చేపట్టేందుకు పంచాయతీలో పైసా నిధులు కూడా లేవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ ఆగిపోయాయి. ప్రభుత్వం వెంటనే 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు తలసరి గ్రాంటు విడుదల చేయాలి. అక్కి వెంకట సుబ్బారెడ్డి, క్రిష్ణంపల్లి సర్పంచ్
ఆగిన పల్లె ప్రగతి
Published Sat, Oct 5 2013 4:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement