
మైనార్టీలను విస్మరించిన ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనార్టీలను విస్మరించిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్....
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
పెనుకొండ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనార్టీలను విస్మరించిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీఖాన్ ఆరోపించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లీం కోసం 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత తెలుగుదేశం హయాంలో రిజర్వేషన్ల అమలు కాకపోయినా మైనార్టీలు ఉన్నారన్న విషయాన్ని గుర్తిస్తే చాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన డీలర్లను బలవంతంగా తొలగించి తెలుగుదేశం వారికి కట్టబెట్టారని, ఇదెక్కడి న్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న కాంట్రాక్ట్ పనులను బలవంతంగా నిలుపుదల చేయించి టీడీపీవారికి కట్టబెట్టాలన్న ఒత్తిడి అధికారులపై అధికమైందన్నారు. దీంతో అధికారులు విధులు నిర్వర్తించాంటే ఆందోళన చెందుతున్నారన్నారు. ఎమ్మెల్యే బీకే. పార్థసారథి కనుసన్నల్లో ఈ వ్యవహారాలు సాగుతున్నాయన్నారు.
త్వరలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై కాంగ్రెస్ తగిన విధంగా స్పందిస్తుందన్నారు. నాయకులు చినవెంకటరాముడు, కేటీ.శ్రీధర్, మహేష్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, సుగుణాకరరెడ్డి, నారాయణస్వామి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ నాయకులతో పడుతున్న ఇబ్బందులను పీసీసీ ఛీఫ్‌కు వివరించారు.
బాబయ్య సమాధిని దర్శించుకున్న రఘువీరారెడ్డి : ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీఖాన్ మంగళవారం స్థానిక బాబయ్య దర్గాను సందర్శించి స్వామివారి సమాధిని దర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వారు పాల్గొన్నారు. అంతకుముందు మాజీ మంత్రికి దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మతపెద్దలతో మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట నాయకులు కేటీ శ్రీధర్, చినవెంకటరాముడు, సుదర్శనరెడ్డి ఉన్నారు.