ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేస్తున్నట్టు చెప్పుకుంటోందని, కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ పనిలో కూడా చిత్తశుద్ధి కన్పించటం లేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని పూర్తిగా మాట్లాడనీయకుండా చేస్తోందన్నారు. ఉగాది సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు శనివారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేందుకు లేవగానే స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఐదారుగురు మంత్రులకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారని, వారు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
పట్టిసీమ టీడీపీ నాయకులు జేబులు నింపుకునేందుకు చేపట్టిన ప్రాజెక్టని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా పట్టిసీమను చేపట్టడం దారుణమన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభించి సంతోషంగా ఉండాలనేది తన కోరికని చెప్పారు. ప్రభుత్వ తీరు రైతులను పట్టించుకునే విధంగా లేదన్నారు. పంటలకు మద్దతు ధరలు లేక రైతులకు పెట్టుబడి కూడా దక్కే అవకాశం కన్పించటం లేదన్నారు.
మార్చి నెలాఖరు వరకు సాగునీరు అందిస్తే కొంతమేర ఉపశమనం లభిస్తుందన్నారు. కానీ వారం రోజులు ముందుగానే సాగునీరు ఆపేసి కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఇస్తుండటంతో రైతులు వేసిన వరి, మొక్కజొన్న, మిరప పంటలు ఎండిపోయే దశకు చేరాయన్నారు. ఏప్రిల్ పదో తేదీ వరకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గోపిరెడ్డిని కలిసినవారిలో ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ కార్యదర్శి పాలపర్తి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రభుత్వం చెప్పేది ఎక్కువ..చేస్తున్నది తక్కువ!
Published Sun, Mar 22 2015 1:45 AM | Last Updated on Tue, Oct 30 2018 3:56 PM
Advertisement
Advertisement