ఆశల మొలక
- ఖరీఫ్ తుదిదశలో కురుస్తున్న వర్షాలు
- అల్పపీడనంతో జిల్లాలో అక్కడక్కడా నాట్లు
- 1.11లక్షల హెక్టార్లలో వరి సాగు పూర్తి
ఖరీఫ్ నెల రోజుల్లో ముగుస్తుందనగా వరుణుడు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. వాడిపోయిన పంటలకు జీవం పోస్తున్నాయి. అనేకచోట్ల రైతులు ఉబాలు చేపడుతున్నారు. మరికొందరు వరినాట్లు వేస్తున్నారు. ఇంతకాలంలో పొలంలో చుక్కనీరు లేక, వేసిన నారు ఎండిపోతున్న దశలో వర్షాలు ఖరీఫ్‌పై ఆశలు కల్పించాయి. క్రమంగా జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
సాక్షి,విశాఖపట్నం: జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2.8 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు కేవలం 1.11 లక్షల హెక్టార్లలోనే పంటలు చేపట్టారు. సీజన్ ముగిసిపోతున్న తరుణంలో మూడు రోజులుగా వర్షాలతో ఇంతకాలం ఖాళీగా ఉన్న పంటలను రైతులు చేపడుతున్నారు.
బుధవారం జిల్లాలో యలమంచి,పాడేరులో,రాంబిల్లి తదితర ప్రాంతాల్లో బారీగా వర్షం కురిసింది. ముఖ్యంగా జలాశయాల్లోనూ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీలో రోజూ వర్షాలతో ఇన్‌ఫ్లో వచ్చి పడుతోంది. దీంతో ఆయకట్టు ప్రాంతాలో రైతులు ధైర్యంగా వరినాట్లుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా మాడుగులలోని పెద్దేరులో ఒక్కసారిగా 400 క్యూసెక్కులు వరద నీరు చేరింది. ఒక్క సారిగా 3 మీటర్ల నీటి మట్టం పెరిగింది. అలాగే ఏజెన్సీలోనూ,అనకాపల్లి,యలమంచిలి,పాయకరావుపేటలో చెరువులు,రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 407.7 మిల్లీమీటర్లు.
ఇంతవరకు 295.5 మిల్లీమీటర్లు నమోదైంది. 14 మండలాల్లో సాధారణంలో సగం కూడా వర్షం కురలేదు. కానీ ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో తక్కువ వర్షపాతం ఉన్న అచ్యుతాపురం, పరవాడ, బుచ్చయ్యపేట, కశింకోట, సబ్బవరం , మాకవరపాలెం , కె.కోటపాడు, ఎలమంచిలి , పెందుర్తి , కొయ్యూరు , చోడవరం తదితర మండలాల్లోనూ వరినాట్లు ఊపందుకున్నాయి.