ఆశల సాగుకు శ్రీకారం
బాపట్లటౌన్: అదను దాటిపోతున్నా చినుకు రాలకపోవడంతో దిగులుగా ఉన్న రైతన్నల్లో కదలిక వచ్చింది. చిన్నపాటి జల్లులతో పలకరించడంతో ఆలస్యంగానైనా సాగుకు సమాయత్తమవుతున్నారు. ఏటా జూన్ నెలాఖరుసరికే నారుమడులు సిద్ధం చేసుకోవాల్సిన రైతన్నలు ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవక కాస్తంత కలవరపడ్డాడు. అయితే రెండు రోజుల నుంచి అల్పపీడనం కారణంగా కురుస్తున్న కొద్దిపాటి వర్షాలు వారిలో మళ్లీ ధైర్యాన్ని నింపాయి. జల్లుల్లో తడుస్తూనే పొలాలను తుక్కురొల్లుకోవడం, గట్లువేసుకోవడం, వాటిని చదునుచేసుకోవడం, విత్తనాలు చల్లుకోవడం వంటి పనులు చేపడుతున్నారు. నిన్నటి వరకు బీడుభూములను తలపించిన పొలాల్లో సైతం దుక్కిదున్నించడం, వాటిల్లో ఎరువులు తోలే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటు చూసినా సాగుసందడే కనిపిస్తోంది.
5.01 సెం.మీ వర్షపాతం నమోదు
జిల్లాలో సోమవారం ఉదయానికి సగటున 5.01 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెల మొత్తమ్మీద 14.21 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 11.32 సెం.మీ. కురిసింది. సోమవారానికి అత్యధికంగా పిడుగురాళ్ల మండలంలో 10.78 సెం.మీ వర్షం పడగా, అత్యల్పంగా వెల్ధుర్తి మండలంలో 0.92 సెం.మీ వర్షపాతం నమోదైంది. పెదకూరపాడులో 10.56 సెం.మీ, నరసరావుపేటలో 8.20, అమరావతిలో 8.12, బెల్లంకొండలో 7.66, మేడికొండూరులో 7.24, బాపట్లలో 7.24, సత్తెనపల్లిలో 7.04, తెనాలిలో 7.04 సెం.మీ. నమోదైంది.
అందరి చూపు ఎన్‌ఎల్‌ఆర్ 145 వైపు...
సాధారణంగా జిల్లా వ్యాప్తంగా మూడొంతుల మంది రైతులు బీపీటీ 5204(సాంబమసూరి), 523, 92 నంబర్లేగాకుండా, ఎన్‌ఎల్‌ఆర్ 28523(శ్రీరంగ) విత్తనాలు అధికంగా సాగు చేస్తారు. ఇసుక నేలల్లోని ఎత్తిపోతల పథకాల కింద సాగుచేసే రైతులు మాత్రమే ఎన్‌ఎల్‌ఆర్ 145 వైపు మొగ్గుచూపేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా చివరి వరకు సాగు సజావుగా సాగుతుందో...లేదోనన్న భయంతో ఎక్కువకాలం ఉండే రకాలను సాగుచేస్తే ఎక్కడ నీటి ఎద్దడి తలెత్తుతుందోనన్న భయంతో తక్కువ కాలంలో పంటచేతికి రావడంతోపాటు, చీడపీడలను తట్టుకొనే సామర్ధ్యం ఉండటం, నేలస్వభావాన్ని బట్టి ఎకరాకు 30 నుంచి 45 బస్తాల మేర దిగుబడి వస్తుండటంతో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకంవైపు ఎక్కువమంది రైతులు మొగ్గుచూపుతున్నారు. వీటిల్లో కూడా స్థానిక బాపట్ల వ్యవసాయ కళాక్షేత్రంలో పండించిన ధాన్యం నుంచి తయారుచేసిన విత్తనాలనే రైతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
వెదపద్ధతే మేలంటున్న వ్యవసాయాధికారులు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నార్లు పోసుకొని 25 రోజుల తర్వాత నార్లుపీకి నాట్లు వేసుకునే కంటే వెదపద్దతిలో నాట్లువేసుకోవడం మేలంటున్నారు వ్యవసాయాధికారులు. సాగు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో వెదపద్ధతిలో సాగుచేస్తే పైరు నీటి ఎద్దడిని తట్టుకోవడంతోపాటు, తక్కువకాలంలోనే పంటచేతికొచ్చే అవకాశం ఉందన్నారు. వీటితోపాటు నారుపెంచడం, దమ్ముచేయటం, నాట్లు వేయించడం లాంటివి అవసరం లేదుగాబట్టి ఎకరాకు సుమారు రూ. 5 నుంచి 7 వేలు వరకు ఆధాచేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం భూమిలో సరిపడ తేమశాతం ఉంటుంది కాబట్టి మొక్క త్వరితగతిన బతికే అవకాశం ఉంటుందన్నారు. వాతావరణ మార్పులకు కారణమైన మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందనీ, తద్వారా వాతావరణంలో కలిగే ప్రతికూల మార్పులను కూడా వెదసాగు తట్టుకుంటుందనీ వారు చెబుతున్నారు.