వర్షంతో ఊరట
- గుడివాడలో అత్యధికంగా 108.8 మిల్లీమీటర్లు
- ఊపిరి పోసుకుంటున్న వరి
- మిరప నారుమడులకు మేలు
- ఊపందుకుంటున్న వరినాట్లు
మచిలీపట్నం : జిల్లాలో గత మూడు రోజులుగా కురుర్తున్న వర్షాలు వరి పైరుకు ఊపిరిపోశాయి. ఈ నెలలోనూ ఆశించిన మేర వర్షం కురవకపోవటంతో నారుమడులు, నాట్లు పూర్తిచేసిన పొలాల్లోని పైరు ఎండిపోయే దశకు చేరుకుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పత్తి మొక్కల్లోనూ ఎదుగుదల లోపించింది. ఈ దశలో కురిసిన వర్షాలు వరి, పత్తి పైర్లకు మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. శనివారం జిల్లాలో 16.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
గుడివాడలో అత్యధికంగా 108.8 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా ఉయ్యూరులో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత మూడు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు అన్ని పంటలకు మేలు చేస్తాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 16వ తేదీ నాటికి 421.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 302.7 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం కురిసింది. వర్షాలు సకాలంలో పడకపోవటంతో ఈ ఏడాది వరినాట్లు వేయటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
గత ఏడాది ఆగస్టు 16వ తేదీ నాటికి 4.50 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తికాగా, ఈ ఏడాది 1.20 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. 1.40 లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరగాల్సి ఉండగా, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి విత్తారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వ్యవసాయ పనుల వేగవంతానికి అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని మండలాల్లో భారీ వర్షాలు నమోదుకావటంతో పొలంలో దమ్ము చేసుకుని వరినాట్లకు సిద్ధం చేసేందుకు అవకాశం ఏర్పడిందని రైతులు అంటున్నారు.
పత్తి రైతుల్లో ఆందోళన
గత మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని తేమశాతం పెరగటంతో పత్తికి కాండం కుళ్లు తెగులు వ్యాపిస్తోంది. ఈ తెగులు సోకిన పత్తి మొక్కలు ఆకులు ఒడిలిపోతున్నాయి. మరో రెండు, మూడు రోజుల పాటు గాలిలో తేమశాతం అధికంగా ఉండి వర్షాలు కురిస్తే కాండానికి కుళ్లు తెగులు మరింత వ్యాపించే ప్రమాదం ఉందని రైతులు బెంబేలెత్తుతున్నారు.
నందిగామ, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో ఈ తెగులు అధికంగా ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దీని నివారణ కోసం ట్రైకోడామా మందును తమ సూచనల ప్రకారం వాడాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మైలవరం, జి.కొండూరు, నందిగామ, జగ్గయ్యపేట, వీరులపాడు తదితర మండలాల్లో మిరప నారుమడులకు వర్షాలు మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న, టమోటా పంటలు సాగు చేసిన పొలలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.
వర్షపాతం వివరాలు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నందివాడ 67.2, ఉంగుటూరు 58.6, పెదపారుపూడి 56.2, గుడ్లవల్లేరు 47.8, గూడూరు 43.4, జి.కొండూరు 40.2, నూజివీడు 35.6, గంపలగూడెం 34.2, ముదినేపల్లి 27.8, పెనుగంచిప్రోలు 27.0, నందిగామ 25.8, కంచికచర్ల 22.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొవ్వ 19.8, జగ్గయ్యపేట 16.6, వీరులపాడు 16.4, మచిలీపట్నం 14.5, చందర్లపాడు 11.6, కైకలూరు 11.2, మండవల్లి 11.0, పామర్రు 10.8, మోపిదేవి 10.4, మైలవరం 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ముసునూరు 9.2, గన్నవరం 9.0, ఎ.కొండూరు 8.2, తిరువూరు 7.8, పెడన 7.6, కోడూరు 7.4, విస్సన్నపేట 6.2, ఇబ్రహీంపట్నం 5.4, రెడ్డిగూడెం 5.2, కృత్తివెన్ను 4.2, బాపులపాడు 4.0, వత్సవాయి 3.8, ఆగిరిపల్లి 3.4, విజయవాడ రూరల్, అర్బన్ 2.6, పమిడిముక్కల 1.4, పెనమలూరు 1.4, కలిదిండి 1.2, కంకిపాడు 1.0, తోట్లవల్లూరు 0.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.