- మన్యంలో ఆశాజనకంగా వాన
- మైదానంలో చినుకు కరువు
- 24 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం
- కొన్ని మండలాల్లో సాధారణం కన్నా తక్కువ
జిల్లాలో తొలకరి పరిస్థితి విచిత్రంగా ఉంది. ఏజెన్సీలో అడపాదడపా వర్షాలతో ఆదివాసీ రైతులు వరినాట్లుకు సిద్ధమవుతుంటే...మైదానంలో చుక్కతడి కనిపించకుండాపోతోంది. మన్యంలో వరినారుపోతలు జోరుగా సాగుతుంటే కొన్ని ప్రాంతాల్లో ఎండిన భూములు దర్శన మిస్తున్నాయి. ఈ నెలలో విశాఖ నగరంతో పాటు పాడేరు మండలంలోనే అధిక వర్షపాతం నమోదయింది. 24 మండలాల్లో అతి తక్కువ, కొన్ని మండలాల్లో తక్కువతో నిరాశపరిచింది.
పాడేరు/నర్సీపట్నంరూరల్ : తొలకరికి మేలుమలుపుగా ఉండాల్సిన ఈ రోజుల్లో జిల్లాలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ వర్షంతో ఏజెన్సీ తడిసి ముద్దవుతుంటే,మైదానంలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. మైదానంలో వానలు లేక రైతులు అల్లాడుతుంటే మన్యంలో మాత్రం భారీ వర్షం పడుతోంది. ఏజెన్సీలోని 11 మండలాల్లో మే నెలలో సరాసరి 1,318 మిల్లీమీటర్లు, జూన్ నెలలో 2,339 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గిరిజన రైతుల్లో ఆనందం నెలకొంది. ఎక్కడికక్కడ వ్యవసాయ భూముల్లో వర్షపునీరు చేరింది. లోతట్టు భూములు చెరువులను తలపిస్తున్నాయి. ఖరీఫ్‌కు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాగా మే నెలాఖరు నుంచే రుతుపవనాలు అనుకూలిస్తాయని ఆశించిన మైదానంలోని రైతులకు నిరాశే ఎదురయింది. ఖరీఫ్‌పనులను దుక్కులతోనే సరిపెట్టుకునే దుస్థితి.
జూన్‌లో సాధారణ వర్షపాతం 128.8 మిల్లీమీటర్లు. 54.4 మాత్రమే నమోదయింది. విశాఖ నగరంతో పాటు ఏజెన్సీ మండలాల్లోనే అధిక వర్షం పడింది. 24 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కన్నా తక్కువ కురిసింది. మరో నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. ఏజెన్సీలో మాత్రం రోజూ ముమ్మరిస్తోంది.
జిల్లాలో ఎక్కువ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. వర్షాభావ పరిస్థితిని గమనించాలంటూ సూచించారు. ఇదే కాకుండా గ్రామ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.