నేడు చారిత్రాత్మక తీర్పు
- జగన్ సీఎం కావడం ఖాయం
- లగడపాటివి సన్నాసి మాటలు
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఉదయభాను
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలు నేడు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, పేట అసెంబ్లీ అభ్యర్థిసామినేని ఉదయభాను స్పష్టం చేవారు. చిల్లకల్లు రోడ్డులోని స్థానిక పట్టణపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమనిఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల వెలువడిన మున్సిపల్, మండల, జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాల్లో వెఎస్సార్ సీపీకి తక్కువ సీట్లు వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 110సీట్లకు పైగా తమ పార్టీ కైవసం చేసుకుని విజయదుందుభి మోగిస్తుందన్నారు. మున్సిపల్,మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు అసలు సంబంధమే ఉండ దన్నారు.
ఆ ఎన్నికలు కేవలం ఒక ప్రాంతానికి చెంది, స్థానిక రాజకీయాలు, స్థానిక గ్రూపు రాజకీయాల ప్రభావంతో నిండి ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నాటికి, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయానికి మధ్యలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించనున్నారన్నారు. గతంలోనూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం తెలుగుదేశానికి ఎక్కువ స్థానాలు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా నీరాజనాలు పలికే విధంగా ఫలితాలు రానున్నాయన్నారు. జిల్లాలోనూ అత్యధిక స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నిలిపే సమర్థవంతమైన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం ఖాయమన్నారు.
లగడపాటివి సన్నాసి మాటలు...
రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగాల్భాలు పలికిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సన్యాసం మాటున సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని ఉదయభాను అన్నారు. కుళ్లు, కుతంత్రాలతో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్లు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు వెల్లడించడం ఆయనకు పరిపాటేనని దుయ్యబట్టారు. బెట్టింగులకు పాల్పడుతూ అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
2009లో కూడా ఈ విధంగానే బెట్లు కాస్తూ కోట్లాదిరూపాయలు గడించారని, ప్రస్తుతం 48గంటల్లో ఫలితాలు వెల్లడవుతాయని తెలిసి కూడా బెట్టింగ్ రాజకీయాలు చేస్తూ అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నారన్నారు. ఆయనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నేతలు తన్నీరు నాగేశ్వరరావు, షేక్ మదార్‌సాహెబ్, తుమ్మేపల్లి నరేంద్ర, తుమ్మల ప్రభాకర్, చింకా వీరాంజనేయులు, జె.ఉదయభాస్కర్, సిహెచ్.జగదీష్, నంబూరి రవి, ఇంటూరి రాజగోపాల్, కాకాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.