కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అనుకున్నట్టే అయ్యిం. శాతవాహన కళోత్సవాలు మళ్లీ వాయిదాపడ్డాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో కళోత్సవాలు జరగడం లేదని, ఎప్పుడు నిర్వహించేది ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత వెల్లడిస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. సుదీర్ఘకాలంగా వాయిదాపడుతూ వస్తున్న కళోత్సవాల నిర్వహణకు తేదీలు ప్రకటించడంతో ఈసారయినా జరుగుతాయని అందరూ అనుకున్నారు. ఈ తరుణంలో కలెక్టర్ వీరబ్రహ్మయ్య గత శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
ఆయన కోలుకోవడానికి మరో నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతోపాటు ప్రభుత్వం ఆశించిన మేర నిధులు మంజూరు చేయకపోవడం, విరాళాలు సైతం సమకూరకపోవడంతో కళోత్సవాలను వాయిదా వేయడమే మంచిదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో మంత్రి శ్రీధర్‌బాబు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఉత్సవాల నిర్ణయంపై మంత్రిపైనే భారం వేసిన జిల్లా యంత్రాంగం చివరికి ఆయన సూచనలతోనే వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
ఆరేళ్ల నుంచి అదే దుస్థితి..
జిల్లా చరిత్ర, సంస్కృతిని చాటే శాతవాహన కళోత్సవాలు ఆరేళ్ల క్రితం వైభవంగా జరిగాయి. ఆ తర్వాత ఇప్పటివరకు ఉత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది జనవరిలో కళోత్సవాలు నిర్వహించడానికి అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రణాళిక రూపొందించారు. కానీ వివిధ కారణాలతో నాలుగుసార్లు వాయిదాపడ్డాయి. తర్వాత కలెక్టర్‌గా వచ్చిన వీరబ్రహ్మయ్య నవంబర్ 23,24,25 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించినా అలా జరగలేదు. తాజాగా మరోసారి కళోత్సవాలు వాయిదా వేయడం విశేషం. ఈ నేపథ్యంలో కళాభిమానులకు మళ్లీ అసంతృప్తే మిగిలింది. వచ్చే ఏడాదిలోనైనా ఉత్సవాలు జరుపుతారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కళోత్సవాలు వాయిదా
Published Fri, Dec 6 2013 3:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement