ఉరవకొండ పట్టణ టీడీపీ అధ్యక్షుడైన చల్లా భగవాన్‌కు అదే పట్టణంలో 6-8-139 ఇంటి నెంబరులో ఒక ఓటు.. 7-1-28 ఇంటి నెంబరులో మరో ఓటు ఉంది. ఆ మేరకు ఆయనకు రెండు ఓటరు గుర్తింపు కార్డులు(ఎపిక్ కార్డు) జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పులతడకగా మారిందనడానికి ఇదో తార్కాణం మాత్రమే.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వెల్లువెత్తుతోన్న ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి దొడ్డిదారులు తొక్కుతున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో 200 ఓట్ల బోటాబోటి మెజార్టీతో గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు బోగస్ ఓటర్లను నమ్ముకుంటున్నారు. బూత్ లెవల్ అధికారులు, తహశీల్దార్లను బెదిరించి, లొంగదీసుకుని భారీ ఎత్తున బోగస్ ఓటర్లను చేర్పిస్తున్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలోనే 11 వేల బోగస్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ప్రకటించడమే అందుకు తార్కాణం. వివరాల్లోకి వెళితే.. ఉరవకొండ నియోజకవర్గం జనాభా 2,74,716. ఇందులో మహిళలు 1,35,880, పురుషులు 1,38,836. ప్రతి వెయ్యి మంది జనాభాకు 619 మంది ఓటర్లు ఉండటం శాస్త్రీయమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉరవకొండ నియోజకవర్గంలో 1,70,0049 ఓటర్లు ఉండవచ్చు. కానీ.. 1,81,195 మంది ఓటర్లు ఉన్నారు. అంటే.. 11 వేలకుపైగా బోగస్ ఓటర్లు ఉన్నట్లు విశదమవుతోంది. ఈ అంశాన్ని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ కూడా బాహాటంగా అంగీకరిస్తున్నారు. బోగస్ ఓటర్లను తొలగిస్తామని ప్రకటించారు. కానీ.. కలెక్టర్ ఆదేశాలను బీఎల్‌వోలు, తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో అమలు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బెదిరింపులేననే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.
బళ్లారి, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో తమ మద్దతుదారులైన వారి పేర్లలను ఉరవకొండ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఇప్పటికే భారీ ఎత్తున చేర్చారు. అందువల్లే ఆ నియోజకవర్గంలో బోగస్ ఓటర్లు భారీ ఎత్తున పెరిగారని అధికారులే అంగీకరిస్తున్నారు. తాజాగా మరో ఐదు వేల మంది బోగస్ ఓటర్లను జాబితాలో చేర్పించేందుకు పయ్యావుల కేశవ్ ఎత్తులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే ఓటర్ల జాబితాలో చేర్పించేందుకు ఐదు వేలకుపైగా ఫారం-6లను బల్క్‌గా టీడీపీ మద్దతుదారులు ఓటరు నమోదు అధికారులకు అందించారు.
ఇతర నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్న తమ మద్దతుదారులను మళ్లీ ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో చేర్పిస్తూనే.. తమ వ్యతిరేక పార్టీకి మద్దతు తెలిపే ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎత్తులు వేస్తున్నారు. వ్యతిరేక పార్టీకి మద్దతు తెలిపే ఓటర్లను గుర్తిం చి.. వారు ఆ ప్రాంతంలో నివసించడం లేదని, మరోక ప్రాంతంలో వారికి ఓటు హక్కు ఉందని తప్పుడు సమాచారం అందించి, ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా పావులు కదుపుతున్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలో బెళుగుప్ప మండలం తగ్గుపర్తిలో ఇతర నియోజకవర్గాలకు చెందిన 360 మందిని ఓటర్ల జాబితాలో చేర్పించారు. ఇదే మండలం కోనాపురంలోనూ 114 మంది ఓటర్లను ఇదే పద్ధతిలో చేర్చారు.
విడపనకల్లు మండలం ఆర్.కొట్టాలలో 220 , గడేకల్‌లో 70, కొట్టాలపల్లిలోనూ 151 మంది బోగస్ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్పించారు.
అనంతపురం నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న 56 మందిని ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం కడదరకుంటలో ఓటర్ల జాబితాలో చేర్పించారు.
ఉరవకొండ నియోజకవర్గంలో విడపనకల్లు మండలం పొలికి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచే 140 మంది ఆ గ్రామంలో నివసించడం లేదని రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం అందించి.. తొలగింపజేసేందుకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చక్రం తిప్పుతున్నారు.
అక్రమాల కొండ!
Published Wed, Dec 18 2013 3:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement