అక్రమాల పుట్టగా ‘ఉపాధి'
సైదాపురం: పల్లె ప్రాంత ప్రజలకు జీవనోపాధి చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమాల పుట్టగా మారింది. కొందరు సిబ్బంది వివిధ రకాలుగా అందినకాడికి దోచుకుతింటున్నారు. చనిపోయిన వారి పేర్లతో పింఛన్లు స్వాహా చేయడంతో పాటు ఒక వ్యక్తి నాటిన నిమ్మ మొక్కలనే ముగ్గురు నాటినట్లు నిధులు డ్రా చేశారు.
ఇలా అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మొత్తంగా సైదాపురం మండలంలోని 31 పంచాయతీల్లో 2013 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.3.5 కోట్లతో పనులు జరగ్గా రూ.కోటికి పైగా దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న సామాజిక తనిఖీ నామమాత్రంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం ప్రజావేదికపై నివేదిక బహిర్గతం చేయాలి.
భారీగా అక్రమాలు
మండలంలో సుమారు 500 మంది చనిపోయిన వృద్ధుల పేరు మీద గతంలో ప్రతి నెలా రూ.200 చొప్పున డ్రాచేసినట్లు తెలిసింది. నెలకు రూ.లక్ష వంతున 14 నెలలుగా రూ.14 లక్షలు స్వాహా అయినట్లు సమాచారం. ఓ పంచాయతీలో ఎంఐ ట్యాంకు నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఏడాది జూన్ 5 నుంచి అక్టోబర్ 1 వరకు 13,515 మంది కూలీలు పనులు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ప్రతి వారం రూ.3,500 నుంచి రూ.5 వేలు చొప్పున డ్రా చేశారు.
రోజూ ఇద్దరు ముగ్గురు మాత్రమే కూలీలు ఆ పనులకు వెళ్లినట్లు సమాచారం. సైదాపురానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పంచాయతీలో సుమారు రూ.16 లక్షలతో హార్టికల్చర్ అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ నిధుల్లోనూ రూ.6 లక్షలు పక్కదారి పట్టాయని తెలిసింది. అప్పటికే నాటిన నిమ్మమొక్కలను మళ్లీ నాటినట్లు చూపి నిధులను కాజేసినట్లు తనిఖీల్లో తేలినట్లు సమాచారం.
ఉపాధి సిబ్బందికి కొందరు నాయకులు కూడా తోడవడంతో ఆ పంచాయతీకి సంబంధించిన రికార్డులు మొదట గల్లంతవగా, తర్వాత మళ్లీ దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత మ రు గుదొడ్ల నిర్మాణంలో అయితే అక్రమాలకు అంతేలేదని సమాచారం. ఓ గ్రామంలోని నిమ్మతోటను చూపించి ఒక ఇంట్లోని ముగ్గురి పేరుతో నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది.