ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
అనకాపల్లి రూరల్ : జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ చెప్పారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలు జిల్లాలో పూర్తిగా తగ్గాయని చెప్పారు. జి.కె.వీధి, చింతపల్లి, కొయ్యూరు ప్రాంతాలలో ఉపాధి హామీ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని, కూలీలు, పింఛన్‌దారులకు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు, ఫోటోల సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని చెప్పారు.
ఇటువంటి వ్యవహార శైలి వల్లే గిరిజనుల్లో వారిపట్ల వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. కూంబింగ్ పార్టీలు, ఎస్‌ఐలు ఏజెన్సీలో గ్రామ సభలు ఏర్పాటుచేసి గిరిజనులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. చిన్నాచితకా పారిశ్రామిక వేత్తలను, కాంట్రాక్టర్లను మావోయిస్టులు బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని కూడా సీరియస్‌గా పరిగణిస్తామని చెప్పారు. జిల్లాలో మహిళలకు రక్షణగా పోలీస్‌స్టేషన్లలో వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
ప్రజల కోసం ఇప్పటికే 1091, 100 నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. అనకాపల్లి మండలంలో అక్రమ ఇసుక, క్వారీలను నిరోధించడానికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. మండలంలో లెసైన్స్‌లేని క్వారీలు ఎక్కువగా ఉన్నాయని, పరిశీలించాక న్యాయపరమైన చర్యలు చేపడతామని చెప్పారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు.
నకిలీ బంగారం, మోటారు సైకిళ్ల దొంగలు ఎక్కువయ్యారని, వీరిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో మూడు నెలల శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన ఏఎస్‌పీ కల్మేష్‌ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి.ఎస్.ఆర్.మూర్తి, పట్టణ, రూరల్ సీఐలు చంద్ర, భూషణనాయుడు పాల్గొన్నారు.
తగ్గిన మావోయిస్టుల ప్రభావం
Published Fri, Jul 11 2014 12:43 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement