సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తలపెట్టిన పోరు జోరు పెరిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా 43వ రోజు బుధవారం ఉద్యమాన్ని మరింత ఉధృతంగా మార్చారు. సమైక్య పోరులో ఉపాధ్యాయుడు శంకరయ్యయాదవ్ మృతికి సంతాప సూచికంగా జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు. దీంతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూత పడ్డాయి. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు తిరగలేదు. విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు బంద్‌ను పర్యవేక్షించాయి. విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన సిమ్‌కార్డులను ఎస్‌ఈకి అప్పగించారు. పోరులో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరులో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు. నెల్లూరులో నీటిపారుదల శాఖ ఉద్యోగులు తమ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు, మానవహారం, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో క్యాంపస్ కళాశాల నుంచి వీఆర్‌సీ కూడలి వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు ఐసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో శంకరయ్య యాదవ్ మృతికి సంతాప సూచికంగా జెడ్పీ కార్యాలయం నుంచి ఉద్యోగులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో కోవూరు గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో శనివారం వరకు పాఠశాలలు మూసేయించాలని నిర్ణయించారు. వెంకటగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆటోయూనియన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి అడ్డరోడ్డు వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కావలిలో ఉపాధ్యాయుడి మృతికి సంతాపంగా ఉపాధ్యాయ సంఘాలు ఆర్‌డీఓ కార్యాలయం నుంచి జెండాచెట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు శంకరయ్య యాదవ్ మృతికి సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి మానవహారం ఏర్పాటు చేశారు. మనుబోలులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి సమైక్యవాదులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు.
ఉపాధ్యాయుడి మృతికి సంతాపంగా పొదలకూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలు ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ శిబిరంలో పాల్గొన్నారు. గూడూరులో సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న రిలే దీక్షల్లో బుధవారం పాలిటెక్నిక్, సిరామిక్ కళాశాలల అధ్యాపకులు కూర్చున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు బత్తిన విజయ్‌కుమార్ శంకరయ్య యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోట క్రాస్‌రోడ్డులో కోట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షలు నిర్వహించారు. శంకరయ్య యాదవ్ మృతికి సంతాపంగా సూళ్లూరుపేట నియోజక వర్గంలో బంద్ నిర్వహించారు. దుకాణాలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.
జోరు పెరిగిన పోరు
Published Thu, Sep 12 2013 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement