అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: కరువు కబంధ హస్తాల నుంచి ‘అనంత’ రైతన్నకు శాశ్వత విముక్తి కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రూ.7,676 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ‘ప్రాజెక్టు అనంత’ ద్వారా సుస్థిర వ్యవసాయం అందుబాటులోకి తెస్తామన్నారు. దీని కోసం పార్టీలకతీతంగా అందరూ చేయీచేయి కలిపి రైతును రాజుగా చేద్దామని పిలుపునిచ్చారు. అనంతపురంలోని రైతుబజార్ ప్రాంగణంలో ‘ప్రాజెక్టు అనంత’ కార్యాలయాన్ని గురువారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ప్రాజెక్టు అనంత’ స్పెషల్ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ నేతృత్వంలోని హై పవర్ టెక్నికల్ కమిటీ జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులపై అధ్యయనం చేసిన తరువాత రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయన్నారు. నిధులు మంజూరు చేయడానికి సానుకూలత వ్యక్తం చేయడం వల్ల అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు.
వరుస కరువులతో సేద్యం చేయడానికి ముందుకు రాని ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా మార్చివేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం నిబద్ధత కలిగిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అందరి ఆమోదంతో నియమించుకున్నామన్నారు. ఇందులో రాజకీయ జోక్యం ఏ మాత్రం ఉండదని, రైతులను భాగస్వాములు చేసి ‘అనంత’ వ్యవసాయ గమనాన్ని సమూలంగా మార్చాలని అధికారులకు పిలుపునిచ్చారు. 42 లక్షల జనాభా కలిగిన జిల్లాలో 35 లక్షల ఎకరాల సాగుభూమి ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాను సస్యశ్యామలం చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నా వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వాలు అధికారం చేపట్టినా ‘ప్రాజెక్టు అనంత’ నిర్విఘ్నంగా కొనసాగుతుందన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది నియోజక వర్గానికి ఒకటి చొప్పున 14 గ్రామాలు ఎంపిక చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఏయే అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉందో గుర్తించి ‘ఆదర్శగ్రామాలు’గా తీర్చిదిద్దుతామన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్, పరిశ్రమలతో యువతకు ఉపాధి లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ‘అనంత’ రైతుల సమగ్రాభివృద్ధి విషయంలో తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పేర్కొన్నారు.
నిధుల కేటాయింపులో వివక్ష చూపరాదని ఎమ్మెల్యేలు కోరారు. ఎంపిక చేసిన 14 గ్రామాలలో కౌకుంట్ల, రుద్రంపేట, కుమ్మరవాండ్లపల్లి, అల్లాపల్లి, బండ్లపల్లి గ్రామాల నుంచి ఒక్క రైతు కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. సమావేశంలో ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మధుసూదన్‌గుప్తా, సుధాకర్, పల్లె రఘునాథ్‌రెడ్డి, బీకే పార్థసారధి, అబ్దుల్‌ఘని, మార్కెట్‌యార్డు చైర్మన్ వై.నారాయణరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, ఏపీడీ ఇక్బాల్‌తో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి కాళ్లుపట్టుకున్న కొండపల్లి నాగరాజు
మంత్రి రఘువీరారెడ్డి వేదికపైకి రాగానే కింద నుంచి ఓ రైతు మంత్రి కాళ్లుపట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం ఏమిటని ఆరాతీయగా... కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కురుబ నాగరాజుగా పరిచయం చేసుకున్నాడు. తనకున్న 4.98 ఎకరాల పొలంలో వేరుశనగ పంట వేసుకున్నాన్నాడు. ఎండిపోతుండటంతో రూ. 4 లక్షల దాకా అప్పు చేసి 13 బోర్లు వేసినట్లు తెలిపారు. అందులో లేకలేక ఒక బోరులో మాత్రమే నీళ్లు వచ్చాయన్నాడు. అయితే ఆ నీళ్లు కూడా తనకు దక్కకుండా ఎవరో ఫిర్యాదు చేయడంతో అధికారులు బోరు సీజ్ చేశారని వాపోయాడు. ఈ పరిస్థితుల్లో తనకు ఆత్మహత్యే శరణ్యమని కంటతడిపెట్టాడు. తనకు ఐదుగురు పిల్లలున్నట్లు తెలిపాడు.
ఎమ్మెల్సీ గేయానంద్‌కు చేదు అనుభవం
‘ప్రాజెక్టు అనంత’ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం 5 గంటలకు రైతుబజార్‌కు వెళ్లేందుకు స్కూటర్‌లో సుభాష్‌రోడ్డు క్రాస్ దగ్గరకు రాగానే స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధిని అని చెప్పినా ‘అయితే మాకేంటి?’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ముందుకు వెళ్లనీయలేదు. 20 నిమిషాల పాటు ఆయనను అక్కడే నిలిపేశారు. చివరకు ఎస్‌ఐ రెడ్డప్ప అక్కడికి వచ్చి ఎమ్మెల్సీ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
ఇక ‘అనంత’ సస్యశ్యామలం
Published Fri, Jan 3 2014 2:48 AM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM
Advertisement