కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా సెక్రటరీ, వరద ప్రభావిత స్పెషల్ ఆఫీసర్ వికాస్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జేడీఏ ఠాగూర్‌నాయక్ తదితర అధికారులతో తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జేసీ కన్నబాబు పాల్గొన్న సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో 15 మండలాల్లో 45 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, బాధితులకు తక్షణం తగిన చేయూతనిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మకూరు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల కాలనీలను వరదనీరు ముంచెత్తడంతో ఇళ్లు దెబ్బతినడంతో బాధితులు అన్ని రకాలుగా నష్టపోయారని, వీరికి బియ్యం, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను ఆదివారం నుంచే సరఫరా చేయాలని జేసీ కన్నబాబును ఆదేశించారు.
వరద తీవ్రతకు దెబ్బతిన్న ఇరిగేషన్ ట్యాంకులు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు, ఇళ్లు తదితరాలను పరిశీలించి నష్టం అంచనాలు వేసి, వాటికి మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లడంతో వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఆదివారం నుండే ప్రత్యేక బృందాలతో సమగ్రంగా సర్వే చేయించాలని జేడీఏ ఠాగూర్‌నాయక్‌ను ఆదేశించారు.
దెబ్బతిన్న తాగునీటి పథకాలను పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. వరద ప్రభావిత గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నారు. సమావేశంలో డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఠాగూర్‌నాయక్, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, ఆర్డీఓలు కూర్మానాథ్, నరసింహులు, హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీపీఓ శోభ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
స్పందించండి
Published Sun, Oct 27 2013 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement