తిరుపతిలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఐసీసీ) ఏర్పాటుకు అప్పటి కిరణ్ సర్కారు కన్సల్టెన్సీ సంస్థలను నియమించడంపై విపక్షనేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రూ.1.22 కోట్లను కన్సల్టెన్సీ ఫీజుగా ఎలా చెల్లిస్తారని నిలదీశారు.. ఇప్పుడు అదే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే తాను విమర్శలు గుప్పించిన సంస్థలకే రూ.30 లక్షలను కన్సల్టెన్సీ ఫీజులు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. విపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని 2012 అప్పటి ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. ఆ హామీని అమలుచేయడంలో భాగం గా ఐటీఐఆర్ ఏర్పాటుకు డిసెంబర్ 24, 2012న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐటీఐఆర్ ఏర్పాటులో భాగంగా రూ.117 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఐసీసీ)ని నిర్మించాలని అదే రోజున ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఐసీసీ భవన నిర్మాణానికి అవసరమైన డ్రాయింగ్, అంచనాలు(ఎస్టిమేట్ల)ను రూపొందించడం కోసం ముంబైకి చెందిన యూసీజే ఆర్కిటెక్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థను కన్సల్టెన్సీగా అప్పట్లోనే ప్రభుత్వం నియమించింది. ఇందుకు ఆ సంస్థకు రూ.47.45 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించేందుకు అంగీకరించింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఐసీసీ ఏర్పాటుకు అవసరమైన సలహాలు సూచనలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఐఐడీసీ లిమిటెడ్ సంస్థను కన్సల్టెన్సీగా ప్రభుత్వం నియమించింది.
ఇందుకు ఆ సంస్థకు రూ.75 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇదే అంశంపై అప్పటి విపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ.. ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిం చారు. రూ.117 కోట్లతో నిర్మించే ఐసీసీకి కన్సల్టెన్సీ సంస్థలకు ఫీజుల కింద రూ.1.22 కోట్లను చెల్లించడమేంటని నిలదీశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కానీ.. ఈ విమర్శలను అప్పట్లో ప్రభుత్వం లెక్కచేయలేదు.
యూసీజే ఆర్కిటెక్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థకు రూ.16 లక్షలు, ఐఐడీసీ లిమిటెడ్ సంస్థకు రెండు విడతల్లో రూ.42 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా అప్పట్లోనే ప్రభుత్వం చెల్లించింది. యూసీజే ఆర్కిటెక్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు రూ.21.45 లక్షలు, ఐఐడీసీ లిమిటెడ్ 8.85 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఐసీసీ ఏర్పాటుకు అవసరమైన సలహాలు, సూచనలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇటు ఐఐడీసీ.. భవన నిర్మాణానికి అవసరమైన డ్రాయింగ్, అంచనాలను యూసీజే సంస్థలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశాయి. ఐసీసీ నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడు టెండర్లు పిలుస్తుంది.. ఎప్పుడు ఖరారు చేస్తుం ది.. మరెన్ని కన్సల్టెన్సీ సంస్థలు తెరపైకి వస్తాయన్నది తేలాల్సి ఉంది.
అప్పుడోమాట.. ఇప్పుడోమాట
Published Sat, Nov 1 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement
Advertisement