International Convention Centre (ICC)
-
అబ్బురపరిచే నిర్మాణం.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే
న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేస్తూ దాని కింద ఇంజినీరింగ్ యొక్క ఘనత.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే.. అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అని రాశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే. నేషనల్ హైవే నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ముగిసే ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ హైవే 563 కి.మీ వెడల్పుతో నిర్మితమైంది.ఈ ప్రాజెక్టు కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏకంగా 1200 చెట్లను తిరిగి నాటారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి. వీడియోలో చూపిన వివరాల ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు మానేసర్ నుండి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 20 నిముషాలు ద్వారకా నుండి సింఘు సరిహద్దు వరకు 25 నిముషాలు మానేసర్ నుండి సింఘు సరిహద్దు వరకు 45 నిముషాల వరకు ప్రయాణ సమయం ఉంటుందని తెలిపింది కేంద్ర రవాణా శాఖ. ఈ హైవే నిర్మాణం గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా మూడు లైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఉక్కును వినియోగించినట్టు ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ కాగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటు వినియోగించగా ఇది దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఆరు రేట్లు ఎక్కువ కావడం విశేషం. Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW — Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023 ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు.. -
నగరం.. ‘గులాబీ’మయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం జరిగే పార్టీ ప్రతినిధుల సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 6వేల మందికి పైగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరుకానున్నారు. పార్టీ 20 ఏళ్ల ప్రస్థానంతో పాటు, ఏడేళ్ల ప్రభుత్వ పాలనలో టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అద్దం పట్టేలా సభ నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏడు అంశాలపై తీర్మానాలే ఎజెం డాగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల నమోదు, పార్కింగ్, భోజనం, సభా వేదిక, ప్రాంగణంతో పాటు నగర అలంకరణ వంటి అంశాలకు ఏర్పాట్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. భారీ కోట ద్వారాన్ని తలపించేలా ప్లీనరీ జరిగే హెచ్ఐసీసీ ప్రవేశ ద్వారాన్ని 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో నిర్మించారు. సభా వేదికపై కాకతీయ కళాతోరణం, కాళేశ్వరం ప్రాజెక్టు, దుర్గంచెరువు థీమ్‌తో భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా 20 మీటర్ల వెడల్పైన తెరపై శాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసా చిత్రాలు గీశారు. పార్టీ అధినేత కేసీఆర్ జీవిత చరిత్ర, ఉద్యమ ఘట్టాలు, ప్రభుత్వ పాలన తదితరాలకు అద్దం పట్టేలా వేలాది ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్ కూడా ప్లీనరీలో భాగంగా ఏర్పాటు చేశారు. హాజరు 10వేలకు పైనే.. పార్టీకి చెందిన మండల, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు మొత్తంగా సుమారు 6వేల మందికి ఆహ్వానాలు పంపారు. వలంటీర్లు, పోలీసులు, మీడియా, ఇతర సహాయ సిబ్బంది కలుపుకుని మొత్తం 10వేల మంది ప్లీనరీకి హాజరయ్యే అవకాశం ఉందన్నది టీఆర్ఎస్ అంచనా. సమావేశానికి హాజరయ్యే వారి కోసం 20 రకాల మాంసాహార, శాఖాహార వంటలను ఆదివారం రాత్రి నుంచి సిద్ధం చేయనున్నారు. సభా ప్రాంగణంలో 36 అడుగుల కేసీఆర్ కటౌట్ ఏర్పాటుతో పాటు హైదరాబాద్ ముఖ్య కూడళ్లను ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లను పలుచోట్ల ఏర్పాటు చేశారు. కాగా, ప్లీనరీకి హాజరయ్యే పార్టీ మహిళా ప్రతినిధులు గులాబీ రంగు చీరలు, పురుషులు గులాబీ రంగు చొక్కాలు ధరించి రావాలని నిర్దేశించారు. ఏడు అంశాలపై తీర్మానాలు ఆహ్వానం అందుకున్న వారు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సభా ప్రాంగణానికి చేరుకుని గుర్తింపు కార్డు ను పొందాలి. ఉదయం 10.45కల్లా తమ స్థానాల్లో అంతా ఆసీనులు కావాలి. ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుండగా, తొలుత టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అనంతరం పార్టీ తరఫున రెండు విడతలుగా ప్రవేశపెట్టే 7 తీర్మానాలపై ఎంపిక చేసిన ప్రతినిధులు ప్రసంగాల అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్లీనరీ ముగుస్తుంది. జాతీయ రాజకీయాలను శాసించే శక్తిగా..: కేటీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించి, తెలంగాణ ప్రజలను 14 ఏళ్ల పాటు జాగృతం చేసి రాష్ట్రాన్ని సాధించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా నిబద్ధతతో ఉద్యమించి జాతీయ రాజకీయాలను శాసించే శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. హెచ్ఐసీసీ ప్రాంగణంలో జరుగుతున్న ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లను శనివారం పార్టీ నేతలతో కలసి కేటీఆర్ పరిశీలించారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు సోమవారం ఉదయానికే హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గులాబీ జెండా కేసీఆర్’అనే పాటల సీడీని కేటీఆర్ ఆవిష్కరించారు. ప్లీనరీ నిర్వహణ బాధ్య తలు చూస్తున్న వివిధ కమిటీల ఇన్చార్జీలు ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, గోపీనాథ్, ఎమ్మె ల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభా కర్, భానుప్రసాద్, కార్పొరేషన్ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఏర్పాట్లు జరుగుతున్న తీరును మంత్రికి వివరించారు. -
అప్పుడోమాట.. ఇప్పుడోమాట
తిరుపతిలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఐసీసీ) ఏర్పాటుకు అప్పటి కిరణ్ సర్కారు కన్సల్టెన్సీ సంస్థలను నియమించడంపై విపక్షనేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రూ.1.22 కోట్లను కన్సల్టెన్సీ ఫీజుగా ఎలా చెల్లిస్తారని నిలదీశారు.. ఇప్పుడు అదే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే తాను విమర్శలు గుప్పించిన సంస్థలకే రూ.30 లక్షలను కన్సల్టెన్సీ ఫీజులు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. విపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని 2012 అప్పటి ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. ఆ హామీని అమలుచేయడంలో భాగం గా ఐటీఐఆర్ ఏర్పాటుకు డిసెంబర్ 24, 2012న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐటీఐఆర్ ఏర్పాటులో భాగంగా రూ.117 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఐసీసీ)ని నిర్మించాలని అదే రోజున ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఐసీసీ భవన నిర్మాణానికి అవసరమైన డ్రాయింగ్, అంచనాలు(ఎస్టిమేట్ల)ను రూపొందించడం కోసం ముంబైకి చెందిన యూసీజే ఆర్కిటెక్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థను కన్సల్టెన్సీగా అప్పట్లోనే ప్రభుత్వం నియమించింది. ఇందుకు ఆ సంస్థకు రూ.47.45 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించేందుకు అంగీకరించింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఐసీసీ ఏర్పాటుకు అవసరమైన సలహాలు సూచనలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఐఐడీసీ లిమిటెడ్ సంస్థను కన్సల్టెన్సీగా ప్రభుత్వం నియమించింది. ఇందుకు ఆ సంస్థకు రూ.75 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇదే అంశంపై అప్పటి విపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ.. ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిం చారు. రూ.117 కోట్లతో నిర్మించే ఐసీసీకి కన్సల్టెన్సీ సంస్థలకు ఫీజుల కింద రూ.1.22 కోట్లను చెల్లించడమేంటని నిలదీశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కానీ.. ఈ విమర్శలను అప్పట్లో ప్రభుత్వం లెక్కచేయలేదు. యూసీజే ఆర్కిటెక్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థకు రూ.16 లక్షలు, ఐఐడీసీ లిమిటెడ్ సంస్థకు రెండు విడతల్లో రూ.42 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా అప్పట్లోనే ప్రభుత్వం చెల్లించింది. యూసీజే ఆర్కిటెక్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కు రూ.21.45 లక్షలు, ఐఐడీసీ లిమిటెడ్ 8.85 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఐసీసీ ఏర్పాటుకు అవసరమైన సలహాలు, సూచనలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇటు ఐఐడీసీ.. భవన నిర్మాణానికి అవసరమైన డ్రాయింగ్, అంచనాలను యూసీజే సంస్థలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశాయి. ఐసీసీ నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడు టెండర్లు పిలుస్తుంది.. ఎప్పుడు ఖరారు చేస్తుం ది.. మరెన్ని కన్సల్టెన్సీ సంస్థలు తెరపైకి వస్తాయన్నది తేలాల్సి ఉంది.