మాదాపూర్ హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో బొంతు రామ్మోహన్, గాంధీ, మాగంటి గోపీనాథ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం జరిగే పార్టీ ప్రతినిధుల సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 6వేల మందికి పైగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరుకానున్నారు. పార్టీ 20 ఏళ్ల ప్రస్థానంతో పాటు, ఏడేళ్ల ప్రభుత్వ పాలనలో టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అద్దం పట్టేలా సభ నిర్వహించనున్నారు.
పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏడు అంశాలపై తీర్మానాలే ఎజెం డాగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల నమోదు, పార్కింగ్, భోజనం, సభా వేదిక, ప్రాంగణంతో పాటు నగర అలంకరణ వంటి అంశాలకు ఏర్పాట్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. భారీ కోట ద్వారాన్ని తలపించేలా ప్లీనరీ జరిగే హెచ్‌ఐసీసీ ప్రవేశ ద్వారాన్ని 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో నిర్మించారు. సభా వేదికపై కాకతీయ కళాతోరణం, కాళేశ్వరం ప్రాజెక్టు, దుర్గంచెరువు థీమ్‌తో భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
టీఆర్‌ఎస్ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా 20 మీటర్ల వెడల్పైన తెరపై శాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసా చిత్రాలు గీశారు. పార్టీ అధినేత కేసీఆర్ జీవిత చరిత్ర, ఉద్యమ ఘట్టాలు, ప్రభుత్వ పాలన తదితరాలకు అద్దం పట్టేలా వేలాది ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్ కూడా ప్లీనరీలో భాగంగా ఏర్పాటు చేశారు.
హాజరు 10వేలకు పైనే..
పార్టీకి చెందిన మండల, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు మొత్తంగా సుమారు 6వేల మందికి ఆహ్వానాలు పంపారు. వలంటీర్లు, పోలీసులు, మీడియా, ఇతర సహాయ సిబ్బంది కలుపుకుని మొత్తం 10వేల మంది ప్లీనరీకి హాజరయ్యే అవకాశం ఉందన్నది టీఆర్‌ఎస్ అంచనా. సమావేశానికి హాజరయ్యే వారి కోసం 20 రకాల మాంసాహార, శాఖాహార వంటలను ఆదివారం రాత్రి నుంచి సిద్ధం చేయనున్నారు.
సభా ప్రాంగణంలో 36 అడుగుల కేసీఆర్ కటౌట్ ఏర్పాటుతో పాటు హైదరాబాద్ ముఖ్య కూడళ్లను ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లను పలుచోట్ల ఏర్పాటు చేశారు. కాగా, ప్లీనరీకి హాజరయ్యే పార్టీ మహిళా ప్రతినిధులు గులాబీ రంగు చీరలు, పురుషులు గులాబీ రంగు చొక్కాలు ధరించి రావాలని నిర్దేశించారు.
ఏడు అంశాలపై తీర్మానాలు
ఆహ్వానం అందుకున్న వారు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సభా ప్రాంగణానికి చేరుకుని గుర్తింపు కార్డు ను పొందాలి. ఉదయం 10.45కల్లా తమ స్థానాల్లో అంతా ఆసీనులు కావాలి. ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుండగా, తొలుత టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అనంతరం పార్టీ తరఫున రెండు విడతలుగా ప్రవేశపెట్టే 7 తీర్మానాలపై ఎంపిక చేసిన ప్రతినిధులు ప్రసంగాల అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్లీనరీ ముగుస్తుంది.
జాతీయ రాజకీయాలను శాసించే శక్తిగా..: కేటీఆర్
అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించి, తెలంగాణ ప్రజలను 14 ఏళ్ల పాటు జాగృతం చేసి రాష్ట్రాన్ని సాధించామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా నిబద్ధతతో ఉద్యమించి జాతీయ రాజకీయాలను శాసించే శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో జరుగుతున్న ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లను శనివారం పార్టీ నేతలతో కలసి కేటీఆర్ పరిశీలించారు.
రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు సోమవారం ఉదయానికే హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గులాబీ జెండా కేసీఆర్’అనే పాటల సీడీని కేటీఆర్ ఆవిష్కరించారు. ప్లీనరీ నిర్వహణ బాధ్య తలు చూస్తున్న వివిధ కమిటీల ఇన్‌చార్జీలు ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, గోపీనాథ్, ఎమ్మె ల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభా కర్, భానుప్రసాద్, కార్పొరేషన్ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఏర్పాట్లు జరుగుతున్న తీరును మంత్రికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment