నీటి సమస్యపై ఉద్యమిద్దాం
► రేపు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా
► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి పిలుపు
తిరుపతి మంగళం: జిల్లాలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, అనుబంధ సంస్థలు, అభిమానులంతా ఉద్యమించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నీటి సమస్య పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపైన చంద్రబాబు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. మండుతున్న ఎండలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజలు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
తాను అధికారంలోకి వస్తే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తానన్న చంద్రబాబు నేడు రైతులకు సక్రమంగా గంట సేపు కూడా విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అర్ధరాత్రి 12గంటల నుంచి కేవలం గంట మాత్రమే విద్యుత్ సరఫరా అందిస్తున్నారన్నారు. దాంతో రైతులు రాత్రుల్లో పొలాల వద్ద జాగారం చేస్తూ పాము కాటుకు, విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, రాష్ట్రంలో నియంతపాలన సాగిస్తూ అరాచకాలు సృష్టిస్తున్న చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే నారాయణస్వామి పిలుపునిచ్చారు.