బోరు బావిలో పసి ‘ప్రాణం’
బోరు బావిలో పసి ‘ప్రాణం’
Published Wed, Aug 16 2017 1:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
- 13 అడుగుల లోతులో ఇరుక్కున్న చిన్నారి
- ఆక్సిజన్ అందిస్తూ సహాయక చర్యలు
వినుకొండ రూరల్: రెండేళ్ల బాలుడు సరదాగా ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనుమర్లమూరి మల్లికార్జున్, అనూషల ఏకైక కుమారుడు చంద్రశేఖర్ మంగళవారం మధ్యాహ్నం తల్లితో కలసి పశువుల పాక వద్దకు వెళ్లాడు. తల్లి గేదెలను మేపుతుండగా.. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. కొంతసేపటి తర్వాత చందు కనిపించకపోవడంతో తల్లి వెతుకులాట ప్రారంభించింది. కనిపించిన వారందరినీ ఆరా తీసింది. చివరకు సమీపంలోని బోరుబావి దగ్గరకు వెళ్లగా అందులో నుంచి బాలుడి మూలుగు వినిపించడంతో గ్రామస్తులు వెంటనే పొక్లెయినర్ తెప్పించారు. సుమారు 13 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు గుర్తించారు. అతడిని రక్షించేందుకు బోరు బావికి సమాంతరంగా గుంత తవ్వుతున్నారు.
సహాయక చర్యల్లో అధికారులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పట్టణ ఎస్సైలు శ్రీనివాసరావు, శివరామయ్య వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అలాగే ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, డీఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీవో రవీంద్ర, తహసీల్దార్ శివనాగిరెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావుతో పాటు వైద్య సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని బాలుడిని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. రాత్రి 8.30 సమయంలో రెస్క్యూ టీమ్ కూడా ఇక్కడికి చేరుకుంది. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల వరకూ గుంత తవ్వారు. అదే సమయంలో బాలుడు ఇబ్బంది పడకుండా వైద్య సిబ్బంది బోరు బావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు.
మా కొడుకును బతికించండయ్యా..
తల్లి అనూష, తండ్రి మల్లికార్జున్‌తో పాటు బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు బోరుబావిలో ఇరుక్కుపోవడంతో ‘మా కొడుకును బతికించండయ్యా..’అంటూ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. 13 అడుగుల లోతులోనే బాలుడు ఉండటంతో ప్రమాదం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement