సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను సహించేది లేదంటూ సింహపురివాసులు కదంతొక్కుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ వెలుగెత్తి చాటుతున్నారు. విభజనకు సిద్ధమైన కాంగ్రెస్‌పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. విభజన ఆపాలంటూ జిల్లావాసులు 36 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. లక్ష జన గర్జనతో గురువారం సింహపురి సింహగర్జన వినిపించనున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు బుధవారం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని హోరెత్తించారు. నగరంలోని ఏసీ స్టేడియంలో లక్ష మందితో నిర్వహించనున్న సమైక్యాంధ్ర సింహగర్జనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల్లూరులో ఆర్టీఓ ఉద్యోగులు తమ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ వాహన ర్యాలీ
నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు.
ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా పట్టణంలోని సత్రం సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు.
బుచ్చిరెడ్డిపాళెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దామరమడుగు, చెల్లాయపాళెం, కాగులపాడు, రేబాల, నాగమాంబాపురం గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో ఉపాధ్యాయుల నిరాహార దీక్ష కొనసాగుతోంది.
వెంకటగిరిలో ఆర్‌వీఎం స్కూల్లో మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర బాల్‌బ్యాడ్మింటన్ కార్యక్రమం చేపట్టారు. ఈఎస్‌ఎస్ డిగ్రీ కళాశాలలో లక్ష పోస్టు కార్డులు ఉద్యమం చేపట్టారు.
ఉదయగిరిలో సమైక్యాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి ర్యాలీ, రాస్తారోకో, వంటావార్పు చేశారు. వరికుంటపాడులో ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడిలో కాంగ్రెస్ నాయకుడు ఇసనాక రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొదలకూరులో సమైక్యవాదులు, అధికారులు, మొబైల్ షాపుల యజమానులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
గూడూరు ఆర్టీసీ డిపో యూనియన్ నాయకులు పట్టణంలో మోటారుసైకిళ్ల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ, మానహారం నిర్వహించారు. మున్సిపల్ ఉపాధ్యాయులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. గూడూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ వారికి మద్దతు తెలిపారు. ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, ఆటోకార్మికులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్‌తో చిట్టమూరు మండలంలో జనజీవనం స్తంభించింది. కోట క్రాస్‌రోడ్డులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన జరిగింది.
సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 23వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. యూటీఎఫ్ ఉపాధ్యాయులు బుధవారం దీక్షలో కూర్చున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ బొమ్మతో శవయాత్ర చేస్తూ భిక్షాటన చేశారు. నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, మానవహారం నిర్వహించారు.
దారులన్నీ.. అటువైపే!
Published Thu, Sep 5 2013 4:27 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement