AC stadium
-
స్టేడియంలో పనులను సకాలంలో పూర్తి చేయాలి
నెల్లూరు(బృందావనం): ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న పునర్నిర్మాణ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నెల్లోపు క్రీడామైదానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) డైరెక్టర్ రవీంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ నిధులతో జరుగుతున్న పనులపై శాప్ డైరెక్టర్ కార్యాలయంలో ఏపీఎంఐడీసీ ఇంజినీరింగ్ , జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారులు, కాంట్రాక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యతలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా, ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను కోరారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలను కలెక్టర్ ద్వారా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలపై అవసరమైతే క్వాలిటీ కంట్రోల్ అధికారుల నివేదిక కోరతామని స్పష్టం చేశారు. ఇండోర్ స్టేడియంలో ఆధునిక వసతి సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మల్టీపర్పస్ ఫ్లోరింగ్‌తో తీర్చిదిద్దనున్నామని వెల్లడించారు. క్రీడా అకాడమీలు ఏర్పాటైతే 20 మంది క్రీడాకారులు శిక్షణ పొందనున్నారన్నారు. ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవిశంకర్బాబు, ఏఈఈ పుల్లయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య, స్టేడియం సూపరింటెండెంట్ విజయకుమార్, కాంట్రాక్టర్ శ్రీహరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
స్టేడియం అభివృద్ధి పనుల వేగవంతం
సెప్టెంబరు నెలాఖరులోగా డీఎస్ఏకు అప్పగించాలి జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ నెల్లూరు(బృందావనం): ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జేసీ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశించారు. సెప్టెంబరులోగా పనులను పూర్తి చేసి జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు అప్పగించాలని సూచించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రూ.2.98కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ ప్రసాద్‌ను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఇండోర్‌స్టేడియాన్ని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ సూచనల మేరకు తీర్చిదిద్దుతున్నట్లు ఈఈ వివరించారు. గతంలో బ్యాడ్మింటన్ కోసం ఐదు కోర్టులు ఉండగా, ప్రస్తుతం 9 కోర్టులను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రెండు కోర్టులు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు, ఏడు కోర్టులు క్రీడాకారులకు వినియోగించనున్నట్లు వివరించారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ డైరెక్టర్ రవీంద్రబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య ఉన్నారు. -
స్టేడియం అభివృద్ధి పనులపై సమీక్ష
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు ఏపీఎంఐడీసీ అధికారులతో గురువారం సమీక్షించారు. ఆగస్టు నెలాఖరులోగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు. వాకింగ్‌ట్రాక్, అథ్లెటిక్స్ట్రాక్, ఎంట్రన్స్గేట్, ఇండోర్‌స్టేడియం, ఫ్లోరింగ్, ఇండోర్‌స్టేడియం డార్మెట్రీ, కాన్ఫరెన్స్‌హాల్ పనులను 40 రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. క్రీడాప్రాంగణంలో డ్రైనేజీ సిస్టమ్, మరుగుదొడ్లు, పెవిలియన్భవనం ఆధునీకరణ పనులు 80శాతం పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తే కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించి మరిన్ని క్రీడామౌలిక సదుపాయాలు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రవిశంకర్బాబు, డీఈఈ సీవీ రమణ, ఏఈ ఎం పుల్లయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
దారులన్నీ.. అటువైపే!
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను సహించేది లేదంటూ సింహపురివాసులు కదంతొక్కుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ వెలుగెత్తి చాటుతున్నారు. విభజనకు సిద్ధమైన కాంగ్రెస్‌పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. విభజన ఆపాలంటూ జిల్లావాసులు 36 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. లక్ష జన గర్జనతో గురువారం సింహపురి సింహగర్జన వినిపించనున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు బుధవారం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని హోరెత్తించారు. నగరంలోని ఏసీ స్టేడియంలో లక్ష మందితో నిర్వహించనున్న సమైక్యాంధ్ర సింహగర్జనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల్లూరులో ఆర్టీఓ ఉద్యోగులు తమ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా పట్టణంలోని సత్రం సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దామరమడుగు, చెల్లాయపాళెం, కాగులపాడు, రేబాల, నాగమాంబాపురం గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో ఉపాధ్యాయుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. వెంకటగిరిలో ఆర్వీఎం స్కూల్లో మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర బాల్‌బ్యాడ్మింటన్ కార్యక్రమం చేపట్టారు. ఈఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో లక్ష పోస్టు కార్డులు ఉద్యమం చేపట్టారు. ఉదయగిరిలో సమైక్యాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి ర్యాలీ, రాస్తారోకో, వంటావార్పు చేశారు. వరికుంటపాడులో ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడిలో కాంగ్రెస్ నాయకుడు ఇసనాక రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొదలకూరులో సమైక్యవాదులు, అధికారులు, మొబైల్ షాపుల యజమానులు భారీ ప్రదర్శన నిర్వహించారు. గూడూరు ఆర్టీసీ డిపో యూనియన్ నాయకులు పట్టణంలో మోటారుసైకిళ్ల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ, మానహారం నిర్వహించారు. మున్సిపల్ ఉపాధ్యాయులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. గూడూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ వారికి మద్దతు తెలిపారు. ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, ఆటోకార్మికులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్‌తో చిట్టమూరు మండలంలో జనజీవనం స్తంభించింది. కోట క్రాస్‌రోడ్డులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన జరిగింది. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 23వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. యూటీఎఫ్ ఉపాధ్యాయులు బుధవారం దీక్షలో కూర్చున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ బొమ్మతో శవయాత్ర చేస్తూ భిక్షాటన చేశారు. నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, మానవహారం నిర్వహించారు.