స్టేడియం అభివృద్ధి పనుల వేగవంతం
-
సెప్టెంబరు నెలాఖరులోగా డీఎస్‌ఏకు అప్పగించాలి
-
జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్
నెల్లూరు(బృందావనం): ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జేసీ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశించారు. సెప్టెంబరులోగా పనులను పూర్తి చేసి జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు అప్పగించాలని సూచించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రూ.2.98కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ ప్రసాద్‌ను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఇండోర్‌స్టేడియాన్ని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ సూచనల మేరకు తీర్చిదిద్దుతున్నట్లు ఈఈ వివరించారు. గతంలో బ్యాడ్మింటన్ కోసం ఐదు కోర్టులు ఉండగా, ప్రస్తుతం 9 కోర్టులను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రెండు కోర్టులు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు, ఏడు కోర్టులు క్రీడాకారులకు వినియోగించనున్నట్లు వివరించారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ డైరెక్టర్ రవీంద్రబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య ఉన్నారు.