నగదు రహిత లావాదేవీలు
-
మినీ సంచార ఏటీఎంను ప్రారంభించిన జేసీ
నెల్లూరు రూరల్ :
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌లో ఎస్‌బీఐ మినీ సంచార ఏటీఎంను ఆదివారం ఆయన ప్రారంభించారు. జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను పెంచడానికి పేటీఎం, మొబైల్ కరెన్సీ, క్యాష్ ట్రాన్స్‌ఫర్ తదితర లావాదేవీలను పెంచడానికి సంబంధిత సర్వీసు ప్రొవైడర్లతో మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారులకు చిల్లర సమస్య లేకుండా సంచార ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 70 పెట్రోలు బంకుల్లో పేటీఎంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన పట్టణాల్లో పేటీఎం, సంచార ఏటీఎం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రూ.26 కోట్లు రూ.100, రూ.50, రూ.10 నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రధాన ఆలయాల్లోని హుండీల్లోని చిల్లరను బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రజలు చిల్లర కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఎస్‌బీఐ జనరల్ జనరల్ మేనేజర్ నారాయణమయ్య మాట్లాడుతూ జిల్లాలో 10 సంచార ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏటీఎంల్లో అన్ని బ్యాంకు ఏటీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ ప్రకాష్‌రావు, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉపేంద్రకుమార్, ఏఎంసీ ఛైర్మన్ మునుకూరు రవికుమార్‌రెడ్డి, వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.