Mini ATM
-
ఊరూ.. వాడా బెల్ట్‌షాపులే..
సంగెం(పరకాల): గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. వాడవాడలా బెల్ట్‌షాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకోస్తున్నాయి. ప్రతి కిరాణా షాపులో మద్యం విచ్చల విడిగా విక్రయాలు చేస్తున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు ఆయా ఆయా మద్యం షాపుల నుంచి ఆటోల ద్వారా డోర్ డెలివరీలు సైతం చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. వైన్‌షాపుల యజమానులు బెల్ట్‌షాపుల వారి నుంచి బాటిల్‌పై రూ.10 నుంచి 20 వరకు ఎమ్మార్పీ రేటుకు మించి వసూలు చేస్తున్నారని వినికిడి. బెల్టుషాపుల యజమానులు మరో రూ.10–20 జోడించి వసూలు చేస్తూ మందుబాబుల జేబులను ఖాళీ చేస్తున్నారని సమాచారం. మినీ ఏటీఎంలుగా మద్యం షాపులు.. బెల్ట్‌షాపులు మినీ ఏటీఎంలు విరాజిల్లుతున్నాయి. ఎటీఎం అంటే ఎనీ టైం మందు అని అర్థమే మార్చుకున్నారు మందుబాబులు. మం డలంలోని 24 గ్రామపంచాయతీలు, శివారు గ్రామాలు, తండాల్లో సుమారు 300లకు పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు వైన్ షాపుకు అనుమతి ఉన్న చోట ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కాని గ్రామాల్లో బెల్ట్‌షాపులు 24 గంటలు తెరచి ఉండటంతో యువత మద్యం మత్తులో తూగుతున్నారు. కొన్ని బెల్ట్‌షాపులు పేకాటకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన యువకులు తాగుడుకు బానిసవుతున్నారు. పనిపాటా లేకుండా ఇంట్లో ఉన్న సరుకులు, సామాన్లు సైతం అమ్ముకుని తాగడానికి వనకాడడం లేదని మహిళలు వాపోతున్నారు. కంటితుడుపు చర్యగా దాడులు.. గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు అనుమతి లేకున్నా అధికారుల అండదండలతోనే నడుస్తున్నట్లు నిర్వాహకులు బాహటంగానే చెబుతున్నారు.అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి ఒకటి, రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లోని బెల్టుషాపులను తొలగించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని పలువురు మహిళలు కోరుతున్నారు. -
నగదు రహిత లావాదేవీలు
మినీ సంచార ఏటీఎంను ప్రారంభించిన జేసీ నెల్లూరు రూరల్ : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో ఎస్బీఐ మినీ సంచార ఏటీఎంను ఆదివారం ఆయన ప్రారంభించారు. జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను పెంచడానికి పేటీఎం, మొబైల్ కరెన్సీ, క్యాష్ ట్రాన్స్ఫర్ తదితర లావాదేవీలను పెంచడానికి సంబంధిత సర్వీసు ప్రొవైడర్లతో మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారులకు చిల్లర సమస్య లేకుండా సంచార ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 70 పెట్రోలు బంకుల్లో పేటీఎంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన పట్టణాల్లో పేటీఎం, సంచార ఏటీఎం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రూ.26 కోట్లు రూ.100, రూ.50, రూ.10 నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రధాన ఆలయాల్లోని హుండీల్లోని చిల్లరను బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రజలు చిల్లర కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఎస్బీఐ జనరల్ జనరల్ మేనేజర్ నారాయణమయ్య మాట్లాడుతూ జిల్లాలో 10 సంచార ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏటీఎంల్లో అన్ని బ్యాంకు ఏటీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రకాష్‌రావు, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉపేంద్రకుమార్, ఏఎంసీ ఛైర్మన్ మునుకూరు రవికుమార్‌రెడ్డి, వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు. -
చోటా ఏటీఎంలు భలే!
వంగర: వంగర మండలంలోని భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) శాఖ ద్వారా రెండు మినీ ఏటీఎంలను గురువారం ప్రారంభించారు. వంగరలో తంగుడు వెంకటరమణ, ఎం.సీతారాంపురంలో పట్నాన గోపాలరావు వీటిని నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఏ బ్యాంకు ఖాతాదారుడైనా ఏటీఎం ఉంటే రోజూ రూ. వంద నుంచి రూ.వెయ్యి వరకు నగదు డ్రా చేసుకునే అవకాశముంది. ఇదో రకమైన మొబైల్ బ్యాంకింగ్ విశాఖపట్నానికి చెందిన పొర్లాస్ ఈ-కామర్స్ సంస్థ మినీ ఏటీఎంల ద్వారా మొబైల్ బ్యాంకింగ్‌ను నిర్వహిస్తోంది. నిర్వాహకులు రూ.3 వేలు చెల్లిస్తే ఒక స్వైపింగ్ మెషీన్‌ను మంజూరు చేస్తారు. దీన్ని నిర్వాహకుడు వినియోగించే సెల్‌ఫోన్‌కు అనుసంధానిస్తారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సెల్ఫోన్లో పొందుపరిచి స్వైపింగ్ మిషన్, సెల్‌ఫోన్ ఆధారంగా నగదు బదిలీ చేస్తారు. ఖాతాదారుడు విత్‌డ్రా చేసిన డబ్బును నిర్వాహకుడు చెల్లిస్తే.. తర్వాతి రోజు ఎస్బీఐ చెల్లించే కమీషన్‌తోపాటు విత్‌డ్రా చేసిన డబ్బును నిర్వాహకుని ఖాతాలోకి మళ్లిస్తారు. ఇలాంటి సదుపాయం కల్పించడంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.