సంగెం(పరకాల): గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. వాడవాడలా బెల్ట్‌షాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకోస్తున్నాయి. ప్రతి కిరాణా షాపులో మద్యం విచ్చల విడిగా విక్రయాలు చేస్తున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు ఆయా ఆయా మద్యం షాపుల నుంచి ఆటోల ద్వారా డోర్ డెలివరీలు సైతం చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. వైన్‌షాపుల యజమానులు బెల్ట్‌షాపుల వారి నుంచి బాటిల్‌పై రూ.10 నుంచి 20 వరకు ఎమ్మార్పీ రేటుకు మించి వసూలు చేస్తున్నారని వినికిడి. బెల్టుషాపుల యజమానులు మరో రూ.10–20 జోడించి వసూలు చేస్తూ మందుబాబుల జేబులను ఖాళీ చేస్తున్నారని సమాచారం.
మినీ ఏటీఎంలుగా మద్యం షాపులు..
బెల్ట్‌షాపులు మినీ ఏటీఎంలు విరాజిల్లుతున్నాయి. ఎటీఎం అంటే ఎనీ టైం మందు అని అర్థమే మార్చుకున్నారు మందుబాబులు. మం డలంలోని 24 గ్రామపంచాయతీలు, శివారు గ్రామాలు, తండాల్లో సుమారు 300లకు పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు వైన్ షాపుకు అనుమతి ఉన్న చోట ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కాని గ్రామాల్లో బెల్ట్‌షాపులు 24 గంటలు తెరచి ఉండటంతో యువత మద్యం మత్తులో తూగుతున్నారు. కొన్ని బెల్ట్‌షాపులు పేకాటకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన యువకులు తాగుడుకు బానిసవుతున్నారు. పనిపాటా లేకుండా ఇంట్లో ఉన్న సరుకులు, సామాన్లు సైతం అమ్ముకుని తాగడానికి వనకాడడం లేదని మహిళలు వాపోతున్నారు.
కంటితుడుపు చర్యగా దాడులు..
గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు అనుమతి లేకున్నా అధికారుల అండదండలతోనే నడుస్తున్నట్లు నిర్వాహకులు బాహటంగానే చెబుతున్నారు.అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి ఒకటి, రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లోని బెల్టుషాపులను తొలగించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని పలువురు మహిళలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment