చివరిరోజు 31 నామినేషన్లు
మొత్తం 48 నామినేషన్లు దాఖలు
బరిలో 32 మంది అభ్యర్థులు
30న నామినేషన్ల ఉప సంహరణ
తిరుపతి తుడా: తిరుపతి ఉప ఎన్నికలో తొలి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం 31 నామినేషన్లు వచ్చాయి. ఉపఎన్నికలో ఇప్పటివరకు మొత్తం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. 32మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి రోజు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో తిరుపతి ఆర్డీవో కార్యాలయం కిక్కిరిసింది. కాంగ్రెస్ పార్టీ తరపున డ్వాక్రా మహిళ శ్రీదేవి నామినేషన్ వేశారు. టీడీపీ డమ్మీ అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేన్ దాఖలు చేశారు. లోక్ సత్తా పార్టీ తరపున బాలసుబ్రమణ్యం రెండో సెట్లు దాఖలుచేశారు. మిగిలిన స్వతంత్య్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఒక్కసారిగా 31 మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రావడంతో ఆర్‌వో కార్యాలయం కిక్కిరిసింది. ఆర్‌వో వీరబ్రహ్మయ్య అభ్యర్థుల నుంచి నామినేషన్ స్వీకరించారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 30 వరకు గడువు ఉంది. 32 మందిలో ఎంతమంది ఉపసంహరించుకుంటారో ఆరోజు తేలనుంది. కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం కావడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో లోక్‌సత్తా, జనసంఘ్ వంటి పార్టీలతో పాటు చాలామంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. ఏకగ్రీవానికి టీడీపీ నేతల ప్రయత్నం విఫలం కావడంతో పోటీ దాదాపు ఖాయమైంది.
శ్రీదేవి నామినేషన్ దాఖలు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్.శ్రీదేవి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎంపీ చింతామోహన్ దంపతులు, పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి సమక్షంలో ఆమె నామినేషన్ వేశారు. భారీ ర్యాలీతో వచ్చిన ఆమె నామినేషన్ వేసిన తరువాత అదే ప్రాంతంలో బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా మహిళగా తనకు టికెట్ రావడం మహిళా సంఘాల విజయమన్నారు. తనకు అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానం, చింతా మోహన్, వేణుగోపాల్‌రెడ్డిలకు కృత జ్ఞతలు తెలిపారు.