గుంటూరు సిటీ: వైఎస్సార్‌సీపీ నేతల నూతనోత్సాహం, కార్యకర్తల కదన కుతూహలం నడుమ ఆ పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కోలాహలంగా జరిగింది. బుధవారం అమరావతి రోడ్డులోని బత్తిన శ్రీనివాసరావు కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అయితే దాన్ని కప్పి పుచ్చుకునేందుకు రాజధాని పేరిట చంద్రబాబు సరికొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.
నిజానికి బాబు చెబుతున్నట్లు మన ప్రభుత్వానికీ సింగపూర్ ప్రభుత్వానికీ నడుమ ఎలాంటి ఒప్పందాలూ జరగలేదనీ, కేవలం ఇక్కడి బాబు తరఫు పారిశ్రామికవేత్తలకూ, అక్కడి బడా పారిశ్రామికవేత్తలకూ మధ్య మాత్రమే చీకటి ఒప్పందాలు జరిగాయని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం అదే పనిగా పట్టుబడుతున్న పట్టిసీమ వాస్తవానికి వట్టిసీమ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో అసంతృప్తులు పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నూతన కార్యవర్గానికి మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి తద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, 5 సంవత్సరాల్లో రావాల్సిన అసంతృప్తిని తెలుగుదేశం ప్రభుత్వం కేవలం 9 మాసాల్లోనే మూటగట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లోపు పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన తరుణ మిదేనని ఆయన పేర్కొన్నారు. పదవులను అలంకార ప్రాయంగా కాక బాధ్యతలా చేపట్టాలని ఆయన సూచించారు.
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో అడ్డదారిన వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ పార్టీకి చెందిన నేతలు భయపడాలి కానీ వైఎస్సార్‌సీపీ శ్రేణులు దేనికీ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురజాల నియోజకవర్గ ఇన్‌చార్జి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన వారంతా క్రమశిక్షణ గల సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రజల తల్లో నాలుకలా మెలుగుతూ పార్టీకి జవజీవాలు నింపాలని పిలుపునిచ్చారు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీ అంశంతోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ అదే అంశంతో ప్రస్తుతం ప్రజల్లో పలుచన అయిపోయిందన్నారు. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ జీవన్మరణ సమస్యలా పోరాడి అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, పదవులు పొందిన అందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు సమాధానం చెప్పలేకే ప్రతిపక్షాన్ని భయబ్రాంతులకు గురి చేద్దామని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పరిపాలన పూరి-చపాతి కథలా ఉందని చమత్కరించారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ప్రజల్లో ప్రభుత్వం అపహాస్యం పాలైందన్నారు. వినుకొండ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు అధికార నేతల్ని హడలెత్తించే స్థాయికి ఎదగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీ కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు.
తాడికొండ ఇన్‌చార్జి క్రిస్టీనా మాట్లాడుతూ పదవులు పొందిన వారు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీని ముందుకు నడిపించాలన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ నాలుగేళ్లు టీడీపీకీ ఓపికగా ఎదురొడ్డి పోరాడాల్సిన బాధ్యత మనపైన ఉందని గుర్తు చేశారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటరమణ, శివరామకృష్ణారెడ్డి, పెదకూరపాడు ఇన్‌చార్జి పాణ్యం హనిమిరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి, సయ్యద్ మాబు, బండారు సాయిబాబు, కొత్త చిన్నపరెడ్డి, మొగిలి మధుసూదనరావు, కోనూరి సునీల్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నసీర్ అహ్మద్, సుద్దపల్లి నాగరాజు, శానంపూడి రఘురామ్‌రెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, షేక్ ఖాజావలి, పురుషోత్తం, శిఖా బెనర్జీ, మేళం ఆనంద భాస్కర్, రాచకొండ ముత్యాలరాజు, హనుమంతునాయక్, అంగడి శ్రీనివాసరావు, అత్తోట జోసఫ్, పోతురాజు రాజ్యలక్ష్మి, కేసరి వెంకట సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నియమితులైన వారందరికీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నియామకపత్రాలు అందజేసి వారి చేత లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయించారు.