ప్రజలే నాయకులై..
Published Thu, Aug 22 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
సాక్షి, ఏలూరు :ప్రజలే నాయకులై.. ప్రజల కోసం.. ప్రజలు చేస్తున్న సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అంతకంతకు ఉధృతమవుతోంది. జిల్లాలో 22వ రోజు బుధవారం ఉద్యమం ఉధృతంగా సాగింది. ప్రాణాలు అర్పించైనా రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడుకుంటామని సమైక్యవాదులు నినదించారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఆదివిష్ణు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. చింతలపూడిలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్ బుధవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
జేఏసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కొయ్యలగూడెం మండలంలో తెలంగాణవారికి సమైక్యవాదులు రాఖీలు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. దీక్షా శిబిరాలను మహిళలు, విద్యార్థులు సందర్శించి దీక్షల్లో ఉన్న వారికి రాఖీలు కట్టారు. రాష్ట్ర విభజనకు నిరసనగా, విజయమ్మ దీక్షకు మద్దతుగా గురువారం బుట్టాయగూడెంలో ఒకరోజు నీరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ప్రకటించారు. ఆయనతోపాటు సర్పంచ్‌లు కూడా దీక్షలో పాల్గొంటారు.
ఏలూరు ఆశ్రం, కలపర్రు టోల్‌గేట్ వద్ద ఎన్జీవోలు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి సమైక్యగళం వినిపించారు. తాడేపల్లిగూడెంలో తూర్పు కాపు సంఘం, వాసవీ క్లబ్, ఆర్యవైశ్య సంఘం, మెప్మా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం నాయకులు పోలీసులకు రాఖీలు కట్టి నిరసన తెలిపారు. కృష్ణ దేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వంటా వార్పు కార్యక్రమం సాగింది. పట్టణంలో బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల బంద్‌కు నాన్ పొలిటికల్, ఎన్‌జీఓ జేఏసీలు పిలుపునిచ్చాయి. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్, తహసిల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షా శిబిరాలు కొనసాగుతుండగా బుధవారం పట్టణంలో బంద్ పాటించారు.
పోడూరు మండలం గుమ్మలూరులో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఆందోళనల్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు బంగారు ఉషారాణి, కలవపూడి శివ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఆచంట మండలం వల్లూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. పెనుగొండలో ఐదో రోజు బంద్ విజయవంతమైంది. మార్టేరులో సమైక్యాంధ్ర కోరుతూ దీక్షలు కొనసాగతున్నాయి.కొవ్వూరులో 19రోజులుగా చేస్తున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. దొమ్మేరులోని పింగాణీ కంపెనీ ఉద్యోగులు బుధవారం నిరాహారదీక్షలో కూర్చున్నారు. న్యాయశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్ష చేపట్టి, మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు పట్టణ వీధుల్లో భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
దేచర్లలో క్వారీ అండ్ క్రషర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కరిబండి విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు దీక్షలో కూర్చున్నారు. సుమారు 500 మంది విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రక్కిలంక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి వేషధారణలు, రోడ్డుపైనే నృత్యాలు చేశారు. భీమవరంలో సమైక్య దీక్షలు కొనసాగాయి. బంద్‌కు మినహాయింపునివ్వడంతో దుకాణాలు తెరచుకున్నాయి. ఆర్టీసీ బస్సులు మాత్రం రోడ్డెక్కలేదు. చింతలపూడిలో కర్రా రాజారావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెల్లం బాలరాజు, మద్దాల రాజేష్‌కుమార్ ప్రారంభించారు.
ఎన్‌జీవోల ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన జరిగింది. జంగారెడ్డిగూడెంలోని బోసుబొమ్మ సెంటర్‌లో క్రైస్తవ సంఘాల వారు మోకాళ్లపై కూర్చొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండోరోజుకు చేరాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త రాధయ్య, పార్టీ ముఖ్యనాయకులు మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలంలో గొర్రెల పెంపకందారుల ఆధ్వర్యంలో గొర్రెల మందతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
Advertisement