
రుణమాఫీపైనారీ భేరి
- జిల్లా వ్యాప్తంగా మహిళల ఆందోళనలు
- ఎంపీడీఓ కార్యాలయాల ముట్టడి
రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మహిళలు పోరుబాట పట్టారు. ఐద్వా ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయాలు ముట్టడించారు. మాఫీ చేసిన వెంటనే తిరిగి సబ్సిడీపై రుణాలివ్వాలని నినదించారు.
దేవరాపల్లి: డ్వాక్రా రుణాల పూర్తి మాఫీ కోరుతూ మహిళలు కదం తొక్కారు. రుణమాఫీని అన్ని గ్రూపులకూ వర్తింపజేయాలని, అప్పు తీర్చిన వారికి సబ్సిడీ రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో రైవాడ అతిథిగృహం నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని ముట్టడించారు. అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని స్తంభింపజేశారు.
డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ హామీని ఎప్పుడు అమలు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. రెండు గంటల పాటు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఎస్‌ఐ వి. లక్ష్మణరావు సిబ్బందితో వచ్చి ఆందోళన విరమించడానికి ప్రయత్నించారు. మహిళలు పోలీసులపై తిరుగుబడడంతో వెనుదిరిగారు. అధికారులు, బ్యాంకు అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని ప్రజావాణి సమావేశ మంది రంలో బైఠాయించారు. దీంతో వివిధ బ్యాంకుల అధికారులు వచ్చి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రుణాలను మాఫీ చేస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు.
అనంతరం ఎంపీడీఓ ఆర్.పూర్ణిమాదేవి, తహశీల్దార్ వై.ఎస్.వి.వి.ప్రసాదరావులకు వినతిపత్రాలిచ్చారు. అంతకుముందు రైవాడ అతిథిగృహం వద్ద జరిగిన సమావేశంలో డ్వాక్రా రుణమాఫీ జరిగే వరకు పోరాటం సాగిద్దామని ప్రతిన పూనారు. వీరికి సీఐటీయూ, ఐకెపీ యానిమేటర్లు, ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.